యూత్ ని తిట్టేముందు ఒక్క‌మాట‌!

ప్రాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో పడి యువత కొట్టుకుపోతున్నది.  డేటింగ్లు. మద్యం వంటి దురలవాట్ల బారిన పడుతున్నది. సెల్ఫోన్లు, ఉచిత ఇంటర్నెట్ వసతులతో చాటింగ్ పేరిట కాలక్షేపం చేస్తున్నది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నది.? అని అనే ముందు ఒక్క‌మాట‌..!!

నిజానికి ఇప్పుడున్న యువ‌త ఆలోచ‌న‌లు అలా లేవు. మెజారిటీ యువ‌త ల‌క్ష్యాల సాధ‌న‌లో నిమ‌గ్న‌మైంది. విభిన్నత కోసం తాపత్రయపడుతున్నారు. ఏదో ఒక ప్రత్యేకతను చాటుకోవాలని ఉబలాటపడుతున్నారు. అది ఒక్క చదువులోనే కాదు ఇతరత్రా విషయాల్లోనూ అదే ఆసక్తిని చూపుతుండడం విశేషం. కాలంతో పోటీపడుతూ పరుగులు తీస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటు దూసుకుపోతున్నరు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగు పెట్టుకుంటున్నారు.

దశాబ్దకాలం క్రితం వరకు వేసవి వచ్చిందంటే చాలు విద్యార్థులు తమ సొంతూళ్లకు, అమ్మమ్మతాతయ్యలు, బంధువుల ఇళ్లకు వెళ్తుండేవాళ్లు. ఆటపాటలతో సెలవులను ఆసాంతం అక్కడే గడిపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. సెలవులను భవిష్యత్కు పనికొచ్చే అంశాలను నేర్చుకునేందుకు వినియోగించుకుంటున్నారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో చేరుతూ తమ సామర్థ్యాలను పెంపొందించుకుంటున్నారు. అదేవిధంగా మూసాధోరణిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ లేదంటే ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులను ఎంచుకోకుండా విభిన్న వృత్తివిద్య కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నరు. తమకు ఆసక్తి ఉన్న, అభిరుచి కలిగిన జర్నలిజం, హోటల్ మేనేజ్మెంట్, ఆఫీస్ సెక్రటరీ, అగ్రికల్చర్, వైద్యరంగంలోని పలు టెక్నీషన్, ఫొటోగ్రఫీ వంటి విభిన్న విభాగాల్లో చేరుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వల్పకాలంలోనే జీవితంలో స్థిరపడేందుకు దోహదం చేసే రంగాలను ఎంచుకుంటున్నారు.

అలాగని పూర్తిగా చదువు, ఉద్యోగం వంటివాటికే యువతీయువకులు పరిమితం కావడం లేదు. వాటితో పాటు ఇతర సమాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటుండడం విశేషం. సంతోషకరమైన విషయం ఏదయినా సరే వేడుకలా నిర్వహించుకుంటున్నారు. పదిమంది కలిసి చారిటిగా ఏర్పడుతూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజసేవకు కేటాయిస్తున్నారు. ఈ విధమైన సంస్కృతి వారిలో రోజురోజుకూ పెరుగుతుండడం ముదావాహం. అదేకాదు రక్తదానం, అన్నదానం, పేదలకు పండ్ల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, అనాథలకు ఆర్థిక సాయం వంటి సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు. మరికొందరు సమాజంలో మూఢనమ్మకాలను, వ్యసనాలను, వివిధ రుగ్మతలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులోనూ యువత తమ ప్రత్యేకతను చాటుకుంటున్నది. అందుకు ప్లాష్మాబ్ కల్చర్ ఒక్కటే నిలువెత్తు నిదర్శనం. పెరిగిన సాంకేతికతను వినియోగించుకుంటూ తమ ప్రతిభను కనబరుస్తూ పదుగురి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇంకొంత మంది యువత ఏకంగా రాజకీయాలపైనా ఆసక్తిని చూపుతున్నది. కొందరు ఏకంగా చట్టసభలకు, అసెంబ్లీలకు పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కన్హయ్యకుమార్, గుజరాత్కు చెందిన హర్దిక్పటేల్ వంటివారే అందుకు ఒక ఉదహరణ. ఇవేకాదు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, పండుగులు, ఉత్సవాల్లోనూ పాల్గొనేందుకు అమితాసక్తిని యువత చూపుతున్నది. అందుకు లలితకళలు, నృత్యం, ఆయా విభాగాల్లో ప్రత్యేక తర్పీదును పొందేందుకు సైతం వెనకడుగు వేయడం లేదు. తల్లిదండ్రులు సైతం చిన్నప్పటి నుంచే తమ పిల్లలను ఆ దిశగా వెన్నుత‌ట్టి  ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే నేటి ఆధునిక యువత జీవతంలో ఆర్థికంగా స్థిరపడాలని, అందులో ఏదో ప్రత్యేకతను చూపాలని కోరుకుంటూనే అదేస్థాయిలో స‌మాజానికి త‌న వంతు ఏదో చేయాల‌నే ఆలోచ‌న‌తో ముందుకు సాగుతున్న‌ది.