పొదుపును మింగి.. అప్పును పెంచిన కరోనా!

ఏడాది కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మాయదారి కరోనా చాలా కుటుంబాలను దారుణంగా దెబ్బతీసింది. వారి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. అప్పుల ఊబిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్వయంగా వెల్లడించింది. అనేక కుటుంబాలను అప్పుల పాలుచేసిన కరోనా మరికొన్ని కుటుంబాల పొదుపు సామర్థ్యాన్ని కూడా దెబ్బతీసింది. పైసాపైసా కూడబెట్టి జాగ్రత్తగా దాచుకున్న డబ్బుల సంచికీ చిల్లుపెట్టింది. చాలా మంది పొదుపు ఖాతాలకు సున్నం కొట్టింది.

ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020- 2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2020 ఏప్రిల్‌, మే, జూన్‌) మన దేశంలో ప్రజల పొదుపు రేటు 21 శాతం ఉండేది. కానీ అది రెండో త్రైమాసికంలో (2020 జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) 10.4 శాతానికి పడిపోయింది. స్వల్పకాలంలోనే పొదుపు రేటు సగానికి సగం పడిపోయింది. కరోనా కష్టాల కారణంగా ప్రజల పొదుపు రేటు పడిపోవడమే కాదు.. అనేక కుటుంబాలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

2020- 21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో కుటుంబాల అప్పుల పరిమాణం దేశ జీడీపీలో 35.4 శాతం ఉండగా, అది సెకండ్‌క్వార్టర్‌లో 37.1 శాతానికి ఎగబాకింది. రెండో త్రైమాసికంలో నమోదైన మొత్తం అప్పుల్లో కుటుంబాల అప్పుల రేటు 51.5 శాతం ఉండటం కరోనా తెచ్చిపెట్టిన కష్టాలకు నిదర్శనం. లాక్‌డౌన్‌ కాలంలో కొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వకపోవడం, కోతలు విధించడం, ఉపాధి కోల్పోవడం, ఉద్యోగాలు ఊడిపోవడం, చాలామందికి వెంటనే కొత్త ఉద్యోగాలు దొరకకపోవడం, కొన్ని వ్యాపారాలు మూతపడటం వంటి కారణాలు ఆయా కుటుంబాలను అప్పుల ఊబిలోకి ఈడ్చుకెళ్లాయి.  జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవాలంటే ఉన్న సంపాదనలోనే ప్రతి నెలా కొంత పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. ఈఎంఐల యుగంలో.. వివిధ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో పొదుపు చేయగలిగే అదృష్టం ఎంతమందికి ఉంటుదన్నదే ప్రశ్న. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మార్కెట్‌శక్తులు చెలరేగిపోకుండా, ప్రభుత్వాలు నిక్కచ్చిగా వ్యవహరించి, ధరలను అదుపు చేస్తే అది రామరాజ్యం అనిపించుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వమే కరోనా కష్టకాలం అని కూడా చూడకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచేసి, తద్వారా అన్ని సరుకుల ధరల పెరుగుదలకు కారణమై, ప్రజల పొదుపు సామర్థ్యాన్ని దెబ్బతీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *