19రోజుల్లో మోడీ లక్షా 8వేల కోట్ల అప్పు..
భారతదేశం రోజురోజుకీ అప్పుల కుప్పలో కూరుకుపోతున్నది. అయితే అప్పు పరిమితి వరకు మంచిదే అని ఆర్థిక వేత్తలు చెప్పేమాట. కాని, అది ఉత్పాదకంగా (ప్రొడక్టివ్)గా ఉంటేనే దేశానికైనా, రాష్ట్రానికైనా మంచి జరుగుతుంది. అప్పులు తీసుకున్న తర్వాత వాటి వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా చేయగలగాలి. అప్పుడే ఆ అప్పుకు అర్థం ఉంటుంది. మన దేశం కేవలం 19 రోజుల్లో లక్షా 8వేల కోట్ల రూపాయల అప్పు చేసినట్లు స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు ఈ అప్పులు తెచ్చినట్లు వెల్లడించింది. అయితే కేంద్రం ఈ అప్పుతో ఏం చేసింది.. ఎక్కడ పెట్టుబడి పెట్టింది… ఏ పరిశ్రమలను ఏర్పాటు చేసింది.. ఎన్ని కొత్త ఉద్యోగాల కల్పన చేసింది.. వంటి అనేకమైన ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి. ఒకవైపు ఉన్న బడా సంస్థలను అమ్మడం, మరోవైపు కొత్తగా అప్పులు తేవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని విషయాల్లో మద్దతు తెలిపే ఆ పార్టీ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.