గులాబీ గూటికి ఎల్​ రమణ.. నిజమేనా?

తెలంగాణలో ఇక టీడీపీ ఖాళీ అయినట్టే.. అడుగు బొడుగు ఉన్నా మొత్తం ఊడ్చుకుపోయినట్టే. ఎందుకంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్​ రమణ టీఆర్​ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో ఇప్పటికే చర్చలు జరిగాయి. గులాబీ కండువా కప్పుకొనేందుకు ఎల్ రమణ కూడా అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో మిగిలిన ఒకే ఒక్క కీలక నేత రమణ. ఇప్పటికే ఆ పార్టీ నేతలంతా టీఆర్​ఎస్​, కాంగ్రెస్​లలోకి వెళ్లిపోయారు. వివిధ కారణాల వల్ల ఎల్​ రమణ ఇప్పటివరకు టీడీపీతోనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఆయన కూడా పార్టీని వీడబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం టీడీపీలో ఉంటే భవిష్యత్​ లేదని భావించి ఆయన గులాబీ గూటికి చేరనున్నట్టు​ తెలుస్తున్నది. కార్యకర్తలతో సమావేశమైన ఎల్​ రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం​.

ఎమ్మెల్సీగా అవకాశం​?

ఎల్ రమణకు టీఆర్​ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఆఫర్​ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విషయంలో మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం. గతంలో ఆయన కూడా టీడీపీలో కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. పాత పరిచయాలతో ఎల్​ రమణను టీఆర్​ఎస్​లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని వినికిడి​. ఇప్పటికే ఫోన్​లో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. ఎల్​ రమణ కూడా రాజకీయ భవిష్యత్​ దృష్ట్యా అంగీకరించినట్టు వార్తలు వినవస్తున్నాయి. ఎల్​ రమణతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్​ కాబోతున్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *