ఐపీఎల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఐపీఎల్-21 తిరిగి ప్రారంభం కానున్నది. కరోనాతో అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌తిరిగి ప్రారంభమవుతుందా లేదా అన్న సందేహాలు వీడిపోయాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 15న దసరా పండగ కూడా ఉండడంతో.. ఫైనల్ రోజు అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. మరోవైపు.. బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మధ్య ఇటీవల జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని.. యూఏఈలోని దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులను సక్సెస్ చేస్తామని బీసీసీఐ చెప్తున్నది. సిరీస్‌లోని బ్యాలెన్స్ మ్యాచ్‌లు పూర్తిచేయడానికి 25 రోజుల విండో సరిపోతుందని బోర్డు భావిస్తుంది. సిరీస్ షెడ్యూల్ అయితే వచ్చేసింది కానీ, విదేశీ ఆటగాళ్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ 25 రోజుల షెడ్యూల్‌లో ఎంతమంది విదేశీ స్టార్ ఆటగాళ్లు వస్తారనేది అనుమానమే. బీసీసీఐ మాత్రం ఆటగాళ్లు, ఆయా దేశాలతో బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. అటు.. ఐపీఎల్‌లో పాల్గొనని ఆటగాళ్ల జీతంలో కోత పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *