మళ్ళీ మళ్ళీ మరిగించిన నూనెలతో అనారోగ్యం..

దేశంలోనే అత్యధిక ఆహార భద్రతా అధికారులు ఉన్న తమిళనాడులో ఆహార పదార్ధాల కల్తీ యధేఛ్చగా సాగుతోంది. తమిళనాడులోని చెన్నైతో సహ ప్రముఖ నగరాల్లో కల్తీ వంట నూనెల విక్రయం జోరుగా సాగుతోంది. ప్రముఖ హోటళ్లు, క్యాంటీన్లలో ఒకసారి ఉపయోగించిన వంట నూనెను సబ్బులు తయారీ, బాయిలర్ కు ఇంధనంగా వాడుకునేందుకు విక్రయిస్తుండగా కొందరు ఆ నూనె కొని తిరిగి ప్యాకింగ్ చేసి వంట నూనెగా విక్రయిస్తున్నారు.ఒకసారి వినియోగించిన వంటనూనెను తిరిగి ఉపయోగిస్తే పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నూనెను మొదట సారి పొయ్యి మీద వేడి చేయటం వలన నాణ్యత లోపిస్తుందని ..తర్వాత దాన్ని ఉపయోగించటం వలన ఎటువంటి పోషకాలు లభించకపోగా శరీరంలో కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.పెద్ద హోటళ్ళలో ఒకసారి ఉపయోగించిన నూనెను తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో కొందరు వ్యాపారులు అది కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. 2011 ఆహార భద్రతా చట్టం ప్రకారం వంటనూనెను సీల్ చేసి మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉంది. విడిగా ఉపయోగించిన నూనెను విక్రయించకూడదు.అయితే ఇప్పటికీ వినియోగించిన నూనెల విక్రయం తమిళనాట కొనసాగుతూనే ఉంది. ఈ వంట నూనెను కల్తీ వ్యాపారులు ఏబీసీడీ అని నాలుగు రకాలుగా వర్గీకరించి విక్రయిస్తున్నారు. అంటే ఒకసారి తయారైన నూనె నాలుగుసార్లు వాడుతున్నారు.మొదట రూ.190 కి కొనుగోలు చేయగా ఉపయోగించిన తర్వాత దాన్ని రూ. 100కి విక్రయిస్తున్నారు. రూ.100 కి కొనుగోలు చేసే వ్యక్తి మళ్ళీ తిరిగి తిరిగి దాన్ని రూ.70 కి. చివరి దశలో రూ. 30కి విక్రయిస్తున్నాడు. ఈరకంగా ఒకసారివినియోగించిన నూనెను తిరిగి తిరిగి వేడి చేయటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *