సానిటైజర్ నుంచి లిక్కర్ తయారీ.. ముఠా అరెస్ట్
ప్రస్తుత పరిస్థితుల్లో సానిటైజర్ను కరోనా సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. దీనిని లిక్కర్ అనుకుని తాగిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలా అనుకోవడం ఎందుకు? సానిటైజర్నే లిక్కర్లా తయారు చేసుకుంటే పోలా అనుకున్నారేమో.. కొంత మంది సానిటైజర్ నుంచి లిక్కర్ తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని కుద్దలూరు జిల్లా రమనంతన్ కుప్పంకు చెందిన ఆరుగురు సానిటైజర్ నుంచి లిక్కర్ తయారీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయగా ఆరుగురు వ్యక్తుల వద్ద కొద్ది మొత్తంలో సానిటైజర్, ఇతర సామగ్రి లభించాయని చెప్పారు. వీటిపై ఆరా తీయగా సానిటైజర్ నుంచి లిక్కర్ తయారు చేస్తున్నట్లు వెల్లడయ్యిందని తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు కూడా దీనిని ధ్రువీకరించారని పేర్కొన్నారు.