ఏ టీకా మంచిదో తెలుసా?
కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇదే తీరుగా మన దేశంలోనూ ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్లను మన దేశంలో పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది మంచిది అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మరికొంత మంది వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. నిజానికి ఏ వ్యాక్సిన్ మంచిది, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాసం నలుగురికి చేరేలా షేర్ చేయండి.
రెండు వ్యాక్సిన్ల ప్రత్యేకత..
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ను ఇనాక్టివేటెడ్ కోవిడ్ వైరస్ ద్వారా రూపొందించారు. ఇందులో భాగంగా నిర్వీర్యం చేసిన కోవిడ్ సార్స్ వైరస్-2ను టీకా ద్వారా మనిషి శరీరంలోకి ఎక్కిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలమై ప్రతి రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రక్తంలో అలాగే ఉంటాయి. ఒకవేళ నిజంగా కోవిడ్ వైరస్ ప్రవేశిస్తే.. అప్పటికే రక్తంలో ఉన్న ప్రతిరక్షకాలు వైరస్‌ను అంతమొందిస్తాయి. అలా వ్యాధి రాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇక కోవీషీల్డ్ ప్రత్యేకత వేరు. దీన్ని వ్యాక్సిన్ వెక్టార్ ఆధారంగా అభివృద్ధి చేశారు. సాధారణ జలుబు కల్గించే ఎడినో వైరస్ (లైవ్)లో కోవిడ్ వైరస్ జన్యుపదార్థాన్ని జొప్పించి ఈ టీకాను తయారు చేస్తారు. టీకా రూపంలో ఇది శరీరంలోకి చేరగానే స్పైక్ ప్రోటీన్‌ని (ఇది కోవిడ్ వైరస్ లక్షణం) ఉత్పత్తి చేస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ గుర్తించి దీన్ని అడ్డుకునేందుకు ప్రతి రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి అలాగే రక్తంలో ఉండిపోతాయి. నిజంగా వైరస్ వస్తే అడ్డుకొని చంపేస్తాయి.
ఏది మంచిది అంటే…
రెండు వైరస్లలో ఏది మంచిదనే విషయాన్ని వాటి పనితీరు సామర్థ్యాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ 81శాతం సామర్థ్యాన్ని చూపుతుంది. ఇక లాన్సెట్ ప్రకారం, కోవీషీల్డ్ కూడా వ్యాక్సిన్ తీసుకున్న 12 వారాల తర్వాత 81శాతం సామర్థ్యాన్ని చూపుతున్నది. అంటే రెండు వ్యాక్సిన్ల పనితీరులో దాదాపు సమానంగానే ఉన్నట్లు తెలుస్తున్నది. వ్యాక్సిన్ ఏది తీసుకున్నప్పటికీ పనితీరులో తేడా పెద్దగా ఉండదని, మంచి ఫలితాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కాస్త వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త స్ట్రెయిన్ రూపంలో విజృంభించే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.