13 ఏండ్లుగా.. 1100 మంది బతుకులు ఆగం 

– డీఎస్సీ 2008 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దీన గాథ 

– 2016 లోనే హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్

– బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు 

– అమలు చేయాలని కోరుతున్న బాధితులు 

 

2008లో ఉమ్మడి పాలకులు చేసిన పాపం వాళ్లకు శాపమైంది. డీఎస్సీలో చేసిన తప్పులు 1100 మంది జీవితాలను ఆగం చేసింది. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని.. చీకటి బతుకుల్లో దీపం వెలిగించాలని 13 ఏండ్లుగా ఎక్కని కోర్టు గడప లేదు.. మొక్కని దేవుడు లేడు.. అడగని నాయకుడు లేడు. బాధితులకు న్యాయం చేస్తామని ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 లోనే వారికి హామీ ఇచ్చారు. తాజాగా హైకోర్టు సైతం వారికి ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కెసిఆర్ ఇచ్చిన హామీని హైకోర్టు తీర్పును, అమలు చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

న్యాయం వాళ్ళ వైపే..  

2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీన 35 వేల పోస్టులలో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులన చెప్పింది. కానీ.. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్‌ 28ను తీసుకొచ్చింది. బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ కూడా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27 ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు.

చివరి నిమిషంలో ఆగమాగం

రాత పరీక్ష నిర్వహించి జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. అజాబితాలో తమ పేరు చూసుకొని అభ్యర్థులు మురిసిపోయారు. కొన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా మొదలైంది. ఇంకొక్క రోజులో నియామక పత్రాలు అందుకుంటామని సంబరపడ్డారు. తమకు ఉద్యోగం వచ్చిందని అందరికీ చెప్పుకున్నారు. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. డైట్ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా.. జూన్ 28న కౌన్సిలింగ్ పై స్టే విధించింది. జీవో 28 ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించాలని కోర్ట్ ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్టు విడుదల చేసి ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక దాదాపు 2000 మంది బీఈడి అభ్యర్థుల కలలు కుప్పకూలిపోయాయి. నాటి ప్రభుత్వం చేసిన తప్పుకు వాళ్ళు బలి అయ్యారు. అప్పటి నుంచి వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 2013 జూలై 15న సుప్రీంకోర్టు బిఈడి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థులు చేసిన ధర్నాలకు ఆమరణ దీక్షలకు టిఆర్ఎస్ పూర్తి మద్దతు పలికింది.

 

సచివాలయానికి పిలిపించి కెసిఆర్ చర్చలు 

2016 జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీఈడీ అభ్యర్థుల ప్రతినిధులను సచివాలయానికి పిలిపించుకున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వారం రోజుల్లోగా సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలంటూ మంజీరా గెస్ట్ హౌస్ లో సదుపాయం కల్పించాలని చెప్పారు. ప్రతినిధుల బృందం దాదాపు వారం రోజులపాటు మంజీరా గెస్ట్ హౌస్ లో ఉండి ఎదురు చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ హామీ అప్పుడు అమలు కాలేదు. ఆ తర్వాత ఒక సందర్భంలో వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలోను నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

అనుకూలంగా కోర్టు తీర్పులు

2017 ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర హైకోర్టు లో జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్, తాజాగా … 27 సెప్టెంబర్ 2022న హైకోర్టు ధర్మాసనం మరోసారి బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2008 dscలో భర్తీ చేయగా మిగిలిపోయిన పోస్టుల్లో పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1100 మంది పిటిషనర్లు ఉన్నారు.

దద్దరిల్లిన ధర్నా చౌక్ 

2016లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, సెప్టెంబర్ 27న హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ అభ్యర్థులు రెండవ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహించారు. ” కెసిఆర్ సారు.. కరుణించండి” పేరుతో నిర్వహించిన ఆ సభకు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. దాదాపు 1000 మంది రావడంతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. జీవితంలో సుమారు 13 ఏళ్ల సమయం వృధా అయిందని తమ జీవితాలను నిలబెట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలతో చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నామని, కొందరు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *