చర్మ సంరక్షణ చాలా ముఖ్యం..

ఇప్పుడు ప్రతి ఒక్కరు మేకప్ లేనిదే బయటకి రావడం మానేశారు. మరి ఇంతలా మేకప్ చేసుకుంటే చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే. కానీ, తమ చర్మ స్వభావానికి అనువైన స్కిన్‌కేర్‌ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. కొందరు చర్మానికి రక్షణ అవసరమని తెలిసినా రకరకాల అనుమానాలు, అపోహల కారణంగా అక్కడే ఆగిపోతారు. అలాంటివాళ్లు తెలుసుకోవాల్సిన విషయాల గురించి వివరంగా చెబుతున్నారు సౌందర్య నిపుణురాలు జైస్వాల్‌.సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఎండాకాలంలో మాత్రమే వాడాలేమో అనుకుంటారు చాలామంది. వర్ష కాలం, చలికాలంలో ఎండ, వేడి ఎక్కువగా ఉండవన్నది వారి అభిప్రాయం. అంతమాత్రాన వాతావరణంలో సూర్యరశ్మి ఉండక పోదు. ఏ కాలంలోనైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటేనే, యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. దాంతో చర్మ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఉండదు.రోజూ మర్దనా చేసుకుంటేనే, చర్మం సురక్షితంగా ఉంటుందని అనుకుంటారు కొందరు. చర్మ రంధ్రాల్లోని నూనె పదార్థాలు, దుమ్ము తొలగించడానికి ఇది మంచి పద్ధతే. అలాగని రోజూ చేస్తే, చర్మంలో సహజంగా ఉండాల్సిన నూనెలు పూర్తిగా తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. సహజంగానే చర్మం ఏరోజుకారోజు మృతకణాలను దూరం చేసుకుంటుంది. కాబట్టి, వారానికి ఒకసారి మర్దనా చాలు.మేకప్‌ వేసుకుంటే చర్మం పాడవుతుందన్న అపోహ ఈరోజుల్లో కూడా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆర్గానిక్‌ మేకప్‌ ప్రొడక్ట్స్‌ దొరుకుతున్నాయి. వాటివల్ల చర్మానికి ఎలాంటి హానీ జరుగదు. అయితే, మేకప్‌ తొలగించకుండా రాత్రంతా నిద్రపోతే మాత్రం మొటిమలు, ముడతలు మొదలైన సమస్యలు ఎదురవుతాయి.ఎటూ ఆయిలీ స్కిన్‌ ఉండటం వల్ల, చాలామంది తమకు మాయిశ్చరైజర్‌ అవసరం లేదని భావిస్తారు. అలాగే, క్రీములు రాసుకుంటే మొటిమలు వస్తాయన్న భ్రమలో ఉంటారు. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు లైట్‌వెయిట్‌, జెల్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్లు వాడటం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే, ఖరీదైన ఉత్పత్తులు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయనుకోవడం సరికాదు. ధరతో సంబంధం లేకుండా, వాటిలో ఏఏ పదార్థాలు వాడుతున్నారన్నది తనిఖీ చేసుకుంటే సరిపోతుంది. మొదటి సారి, ప్రయోగాత్మకంగా కొద్ది మోతాదులో వాడి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *