వ్యాక్సిన్ ఏ డోస్ తర్వాత ఏ డోస్ తీసుకోవాలో తెలుసా..

వ్యాక్సిన్ ఏ డోస్ తీసుకుంటే మంచిదో తెలుసా.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగ‌వంతంగా కొన‌సాగుతున్న‌ది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల‌ ప్ర‌కారం మొద‌టి డోస్ ఏ వ్యాక్సిన్‌ను తీసుకుంటే రెండో డోస్ కూడా క‌చ్చితంగా అదే వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్ని దేశాల్లో అదే ప్ర‌కారం వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న‌ది. కానీ, మొద‌టి డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకున్న‌ వారికి రెండో డోస్ అదే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూడ‌టం అనేది అధికార యంత్రాంగానికి త‌ల‌కు మించిన భారంగా మారింది.ఈ నేప‌థ్యంలో ఒకే వ్య‌క్తికి రెండు వేర్వేరు కొవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చే వెసులుబాటు ఉంటే బాగుండున‌నే విష‌యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందు కోసం అవ‌స‌ర‌మైన డేటాను సేకరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న కొవిడ్‌ టీకాలన్నీ.. వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి ఉద్దేశించినవే. అయితే వాటి పనితీరులో వైరుధ్యాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లోని టీకా విభాగం డైరెక్టర్‌ కేట్‌ ఒబ్రెయిన్ తెలిపారు. ‘టీకాలు పనిచేసే మౌలిక సూత్రం ఒకేలా ఉండటంవల్ల వేర్వేరు డోసులు కూడా పనిచేస్తాయని భావిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాలతో వేర్వేరు డోసుల విధానంపై పరిశోధనలు జరుపుతున్నారు. స్పెయిన్, జర్మనీ దేశాల్లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదట ఆస్ట్రాజెనెకా టీకా ఆ తర్వాత ఫైజర్ టీకా పొందడం సురక్షితమేనని, ఈ విధానం సమర్థంగానే పనిచేస్తుందని పరిమిత డేటా సూచిస్తున్న‌ది. అయితే ఈ మిశ్రమం వల్ల నొప్పులు, చలి వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు తలెత్తవచ్చని పరిశోధకులు చెప్పారు. కొంద‌రిలో ఈ విధానంవల్ల బలమైన రోగనిరోధక స్పందన వెలువడటం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.కాగా, కొన్ని ప్రాంతాల్లో అరుదైన సందర్భాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేర్వేరు డోసులను అనుమతిస్తున్నారు. ఆస్ట్రాజెనికా టీకా అనంతరం కొద్ది మందిలో రక్తంలో గడ్డలు ఏర్పడుతుండ‌టంతో మొదటి డోసు కింద ఈ టీకా పొందినవారు రెండో డోసు కింద ఫైజర్‌ లేదా మోడెర్నా వ్యాక్సిన్‌ను పొందాలని యూరప్‌లో కొన్ని దేశాల్లో వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *