సైనోవాక్ టీకాతో కోవిడ్ కి చెక్

నిన్నా..మొన్నటి వరకు కరోనా కరోనా..ఇప్పుడు వ్యాక్సిన్ గోల. ఏ టీకా బాగా పనిచేస్తుంది ఎన్నిరకాల వైరస్‌లను అరికడుతుంది అనే చర్చలే. ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల టీకాల సామర్థ్యంపై అధ్యయనాలు, పరీక్షలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్‌లోని ఓ చిన్న పట్టణంలో జరిపిన అధ్యయనంలో చైనా తయారు చేసే సైనోవాక్ అనే టీకా కోవిడ్ విస్తరణను దీటుగ అడ్డుకుందని తేలింది. ప్రపంచంలోని అనేక పేద, వర్ధమాన దేశాలు ఈ వ్యాక్సిన్‌నే వినియోగిస్తున్నాయి. సెరానా అనే పట్టణంలో 45 వేల జనాభా ఉంటారు. వారందరికీ భారీ స్థాయిలో టీకాల పంపిణీ పూర్తి చేశారు. దాంతో మరణాల సంఖ్య 95 శాతం తగ్గిపోయింది. అలాగే లక్షణాలతో కూడిన కరోనా కేసులు 80 శాతం తగ్గిపేయాయి. ఆస్పత్రులలో చేరే కేసుల సంఖ్య 86 శాతం తగ్గిపోయింది. పట్టణ పౌరుల్లో 75 శాతం మంది టీకాలు తీసుకున్నారు. ఇక లక్షిత వయోవర్గంలో 95 శాతం మంది రెండు డోసులు పూర్తి చేశారు. తీవ్రమైన దుష్ప్రభావాలు ఎక్కడా కనిపించలేదు. రెండో డోసు పడిన 14 రోజుల తర్వాత కోవిడ్ మరణానికి గురైన సందర్భాలు కనిపించలేదు. టీకాలతో మహమ్మారిని అదుపు చేయగలమని నమ్మకం కుదిరినట్టు ఓ అధికారి చెప్పారు. పిల్లలకు కూడా టీకాలు ఇచ్చి స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. గతనెల ఇండొనీషియాలో 1,30,000 మంది కార్మికులపై జరిపిన అధ్యయనంలోనూ చైనా వ్యాక్సిన్ 94 శాతం మందికి రక్షణ కల్పించినట్టు వెల్లడైంది. మరణాలు 96 శాతం, ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య 98 శాతం తగ్గిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *