స్క్రీన్ టైంతో .. పెరిగిన దృష్టి లోపాలు

లాక్‌డౌన్ వల్ల వచ్చిన వర్క్ ఫ్రం హోం కారణాలతో 2020లో మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొందరు ఉద్యోగులు గత 15 మాసాల కాలంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చాలా మంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ల కారణంగా చాలామంది ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల మాధ్యమంగా బోధన జరుగుతోంది. ఆన్‌లైన్ క్లాసులకు విద్యార్థులు తమ దగ్గరున్న మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లతో హాజరవుతున్నారు. క్లాస్ ల అనంతరం కూడా వాటికే విద్యార్థుల అతుక్కుపోతున్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో గడుపుతున్నారు. స్క్రీన్ టైమ్ చాలా పెరగడంతో విద్యార్థులు దృష్టి లోపాలకు గురవుతున్నారు. మరోవైపు ఇళ్లలో కాలక్షేపం కోసం పెద్దలు కూడా మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ తెరలకు అతుక్కుపోతున్నారు.మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్‌లతో గంటల తరబడి గడపడంతో వీరు కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్ కు చెందిన సంస్థ ఫీల్ గుడ్ కాంటాక్ట్ చేపట్టిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ లెన్సింట్ గ్లోబల్ హెల్త్, స్క్రీన్ టైం ట్రాకర్ అధారంగా ఫీల్ గుడ్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. అవసరానికి మించిన సమయం స్క్రీన్లపై గడుపుతున్న కారణంగా దేశంలో దాదాపుగా 27.50 కోట్ల మందికి దృష్టి క్షీణించిందని అధ్యయనంలో వెల్లడించింది. కళ్లద్దాలు ధరించాల్సిన పరిస్థితిలో దేశంలోని 23 శాతం జనాభా ఉన్నట్లు తెలిపింది. అప్పటికే కళ్లద్దాలు కలిగివున్న వారి సైట్ నంబర్ పెరిగిందని ఆ అధ్యయనం తేల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *