N95 మాస్క్‌లను ఉతకవచ్చా..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ అవసరం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. మాస్క్ ధరించకుండా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. మరి మాస్క్ ని ఉతకవచ్చా..ఎన్ని రోజులకి ఉతకాలి. ఆ వివరాలు చూద్దాం. ఎన్ 95 మాస్కులు కరోనా వైరస్‌ను 95 శాతం వరకు సమర్థంగా అడ్డుకుంటాయి. కాకపోతే సర్జికల్, బట్ట మాస్కులతో పోలిస్తే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా అని వీటిని ఉతికి వాడుకోవడం చేయొద్దు. వీటిని ఉతకడం వల్ల వడపోత సామర్థ్యం దెబ్బతింటుంది. అప్పుడు ఈ మాస్కులను ఉపయోగించిన ప్రయోజనం ఉండదు. N95 మాస్క్‌లను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మాత్రమే శుభ్రం చేస్తారు.డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, అలాగే కరోనా బారిన పడిన వారిని చూసుకునే వారు కూడా ఈ ఈ N95 మాస్కులను తప్పనిసరిగా వాడాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా వీటిని ధరించాలి. మిగిలిన వారు మూడు పొరలతో కూడిన సర్జికల్ మాస్కులు ధరిస్తే చాలు.సాధారణంగా ఎన్ 95 మాస్కులను ప్రతి 8 గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక మాస్కును ఎక్కువ సార్లు వాడాలని అనుకుంటే.. తొలి రోజు ఒక మాస్క్ వాడిన తర్వాత దాన్ని ఒక కవర్లో భద్రపరచుకోవాలి. రెండో రోజు ఇంకో మాస్క్ వాడి దాన్ని వేరే కవర్లో భద్రపరచుకోవాలి. ఇలా నాలుగు మాస్కులను నాలుగు రోజులు వాడాలి. ఆ తర్వాత ఐదో రోజు మొదటి రోజు వాడిన మాస్క్‌ను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మాస్క్ మీద వైరస్‌తో కూడిన తుంపర్లు ఏవైనా చేరి ఉంటే ఆ నాలుగు రోజుల్లో ఎండిపోతాయి. ఇలా ఒక్కో మాస్క్‌ను నాలుగు నుంచి ఐదు సార్లు వాడుకోవచ్చు.రెస్పిరేటరీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కులను మాత్రమే వాడాలి. రెస్పిరేటరీ వాల్వ్‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అదే మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపిచేస్తుంది. ఒకవేళ కరోనా సోకిన వారు రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కులు ధరిస్తే వారు వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.