అమరవీరుల స్తూపానికి టీఆర్ఎస్ క్షీరాభిషేకం!
డ్రగ్స్ వ్యవహారంలో అమరవీరుల స్తూపం ముందు శపథం చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అమరవీరుల స్తూపానికి అవమానం జరిగిందంటూ.. ద ఫోర్త్ ఎస్టేట్ వెబ్సైట్ ప్రచురించిన వార్తకు స్పందించిన టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని పాలు, గంగాజలంతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, విద్యార్థి నాయకులు తుంగ బాలు, మధుకర్ యాదవ్, అనిల్ గౌడ్, మేకల రవి, సుధీర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీకాంత్, ఎన్ఎన్ రాజు, టీఆరెస్ మహిళ కార్యకర్తలు, టీఆర్ఎస్వీ విద్యార్థి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాబా ఫసిఉద్దీన్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాక తో అమరవీరుల స్తూపం అపవిత్రం అయ్యింది అని, తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు పాల్గొనని రేవంత్ రెడ్డికి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చే అర్హత లేదు అన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా బాబు తొత్తు అని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్, రాహుల్ గాంధీ, కొండ విశ్వేశ్వరరెడ్డిలు ముందుగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.