ఆసనాలతో ఆయుష్..

కరోనా సోకి వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత దాని తీవ్రత అధికమవుతున్న కొద్ది ఆక్సిజన్‌ అవసరం ఏర్పడుతుంది. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది లంగ్స్‌ సమస్యలతో పల్స్‌ రేట్‌ పడిపోయి జీవితాలను కోల్పోయారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా..మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం లేకుండా కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే పలు ఆసనాలు చేయడం ఎంతోమేలని సూచిస్తున్నారు రామకృష్ణమఠం యోగా నిపుణుడు నేతికర్‌ లివాంకర్‌.

భుజంగాసనం
భుజంగం అంటే తాచుపాము. ఈ ఆసనం చేసినప్పుడు శరీరం పడగవిప్పిన తాచుపాములా కనిపిస్తుంది. ఈ ఆసనం వెన్నెముక సాగేటట్లు బలపడేలా చేస్తుంది. రొమ్ము భాగంలోని కండరాలు సాగుతాయి. పొత్తి కడుపులో ఉన్న కొవ్వు తగ్గుతుంది. జీర్ణక్రియ, పేగుల కదలికలు మెరుగవుతాయి. స్లిప్‌డిస్క్‌ వల్ల కలిగే బాధ నయమవుతుంది. అన్నిరకాల నడుము నొప్పలు తగ్గుతాయి. శ్వాస సమస్యలు తగ్గుతాయి.
చేసే విధానం
బోర్లాపడుకుని శ్వాస వదులుతూ అరచేతులను పక్కటెముకల పక్కన చాతికి కొంచెం దిగువన నేలపై ఉంచాలి.
మోచేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి. కాలివేళ్లు, మడమలు, తగిలేటట్లు కాళ్లను దగ్గరగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తలను, చాతిని, నడుము పైభాగాన్ని వరుసగా పైకెత్తాలి.
ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకన్లు నుంచి ఒక నిమిషం వరకు ఉంచాలి.
అనంతరం శ్వాస వదులుతూ నడుము పైభాగం, చాతి, తల వరుసగా కిందకు దించాలి. అనంతరం మకరాసనంలో సేదతీరాలి.

పశ్చిమోత్తాన ఆసనం
ఈ ఆసనం వల్ల తొడలోని కండరాలు(హామ్‌స్ట్రింగ్స్‌), పిక్కలు సాగి బలోపేతం అవుతాయి. వెన్నెముకలోని నరాలు, కండరాలు ఉత్తేజమవుతాయి. రుతుక్రమ సంబంధిత వ్యాధులు, పైల్స్‌, కాలేయ వ్యాధులు, మధుమేహం, పెద్దపేగు, మూత్రశయానికి సంబంధించిన వ్యాధులు, ఇన్నోఫీలియో వ్యాధులకు ఈ ఆసనాన్ని మంచి చికిత్సగా పేర్కొంటారు. పొత్తికడుపులోని అవయవాలు బలోపేతమవుతాయి. మలబద్ధకం, అజీర్ణ సమస్యను ఈ ఆసనం చాలావరకు నయం చేస్తుంది.
చేసే విధానం
దండాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులను భూమికి సమాంతరంగా పక్కకు చాపాలి. అనంతరం రెండు చేతులు పైకి లేపాలి. భుజాలు చెవులను తాకుతూ ఉండాలి. అరచేతులు ముందుకు ఉండాలి. అనంతరం శ్వాస వదులుతూ వీపు కింద భాగం నుంచి ముందుకు వంగుతూ..చూపుడు వేళ్లతో కాళ్లబొటన వేళ్లను పట్టుకోవాలి. అనంతరం శ్వాస వదులుతూ ఇంకా ముందుకు వంగి, నుదుటిని మోకాళ్లపై ఆనించాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ పొట్టను తొడలపై ఆనించి, ముఖాన్ని కాళ్ల మధ్య ఉంచి, మోచేతులను నేలపైన పెట్టాలి. అనంతరం ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉంచాలి.

శశాంకాసనము
ఈ ఆసనంతో వెన్నెముక సాగి, మెదడు విశ్రాంతి పొందుతుంది. మోకాళ్లు బలపడుతాయి. పొత్తికడుపులోని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం మొత్తం విశ్రాంతి పొందడం వల్ల ఈ అనుభూతి శరీరం అంతటా తెలుస్తుంది.
చేసే విధానం
దండాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులను తలపైకి నిటారుగా చాపాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ చేతులను నేలపై ముందుకు చాపాలి. నుదుటిని నేలపైన ఆనించాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులు, వీపును పైకి ఎత్తి వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస వదులుతూ చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచి దండాసనంలో కూర్చొని సేద తీరాలి.

ఉష్ర్టాసనం
ఈ ఆసనంతో నడుము నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కీళ్ల నొప్పులు, సయాటికా, గ్యాస్ట్రిక్‌ బాధలు ఉన్నవారికి ఇది మంచి చికిత్స. ఈ ఆసనం ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. భుజాలలోనూ, వీపులోనూ స్టివ్‌నెస్‌ను తగ్గిస్తుంది.
చేసే విధానం
వజ్రాసనంలో కూర్చోవాలి. మోకాళ్లపైన నడుము నిటారుగా ఉంచి నిల్చోవాలి. మోకాళ్ల మధ్య, పాదాల మధ్య ఒక అడుగుదూరం ఉండాలి. అనంతరం శ్వాస వదులుతూ రెండు చేతులను నడుముపై ఉంచి, వెన్నెముకను, పిరుదలను వంచుతూ వెనుకకు వంచి, పక్కటెముకలను ముందుకు తోస్తూ..కుడి అరచేతిని కుడి అరికాలుపైన ఉంచాలి. అనంతరం శ్వాస వదులుతూ ఎడమ అరచేతిని ఎడమ అరికాలుపైన ఉంచి, పిరుదలను ముందుకు తోసి, మెడను సాగదీసి, వెనుకకు చూడాలి. కళ్లు తెరిచే ఉంచాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకూ ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతులను ఒకదాని తర్వాత ఒకటి నడుముపై పెట్టాలి. నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపి, మోకాళ్లపైన నిల్చోవాలి. శశాంకాసనంలో సేదతీరాలి. తరువాత వజ్రాసనంలోకి ఆపై దండాసనంలోకి మారాలి. వీటితోపాటు భస్త్రిక ప్రాణాయామం, కపాలబాతి, నాడిశద్ధిలతో ఊపిరితిత్తుల పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *