ఇండియాలో థర్డ్ వేవ్ ఖాయం..

కరోనా కట్టడి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లిప్త ..నిర్లక్ష్య ధోరణుల కారణంగా.. కొవిడ్-19 మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందా.. ఇప్పటి వరకు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వరకు వచ్చి.. దేశ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన కరోనా.. ఇప్పుడున్న పరిస్తితి కొనసాగితే.. థర్డ్ వేవ్ వరకు ఎగబాకడం ఖాయమా.. అంటే.. ఔననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు.ప్రస్తుతం.. ప్రపంచంలో కరోనా బాధిత దేశం ఏదైనా ఉంటే అది మన దేశమే. కొన్నాళ్ల కిందటి వరకు ఇంకే ముంది.. కరోనా అంతమైపోయిందని పాలకులు ప్రచారం చేసుకున్నారు. పళ్లాలు మోగించారు చప్పట్లు కొట్టించారు. పరాయి దేశాల్లో పేరు గడించేందుకు మనదగ్గర తయారైన వ్యాక్సిన్ను విదేశాలకు ఎగుమతు లు చేయడంలోనూ పాలకులు బిజీ అయ్యారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే.. దేశ ద్రోహులు అనే ముద్ర వేసేశారు. మొత్తంగా దేశం కరోనా కోరల్లో చిక్కుకునే వరకు ఉదాసీన వైఖరిని అవలంబించారు.ఇక ఆ తర్వాత అయినా.. చర్యలు తీసుకున్నారా? అంటే.. అది కూడా లేదు. `లాక్డౌన్ మీ ఇష్టం`-అంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలకే ఈ నిర్ణయాన్ని వదిలిపెట్టి.. చేతులు దులుపుకొన్నారు. ఫలితంగా దేశంలో వేల సంఖ్యలో కరోనా బారిన పడి ప్రజలు చనిపోవాల్సిన దుస్తితి దాపురించింది. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ను మించిన మహా ఔషధం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీకి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు పాలకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పరిస్థితి లేదు.ఆయా పరిస్థితులను గమనిస్తున్న అంతర్జాతీయ మీడియా.. భారత్లో ఇదే పరిస్థితి కొనసాగితే.. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ఎంతో సమయం పట్టదని అంటోంది. ప్రస్తుతం దేశంలో 45 ఏళ్ల వయసు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వాస్తవానికి 18-44 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడిచినా.. వ్యాక్సిన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టని కారణంగా.. ఈ ప్రతిపాదన కేవలం ప్రకటనకే పరిమితమైంది. దీంతో వ్యాక్సిన్ యువతకు అందని పరిస్థితి ఏర్పడింది.పైగా ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న లాక్డౌన్ను యువత పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. దీంతో ముందు వీరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ యూ త్కు వ్యాక్సిన్ ఇవ్వాలంటే.. కనీసం మరో ఆరు మాసాల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని బట్టి కరోనా థర్డ్ వేవ్ విజృంభించడం ఖాయమని అంటున్నారు అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా. ఇప్పటికే సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న దేశానికి థర్డ్ వేవ్ మరింత ప్రమాదమని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా థర్డ్ వేవ్పై ముందుగానే దృష్టి పెట్టి వ్యాక్సిన్ పంపిణీని పెంచితే నే పరిస్థితి మెరుగు పడుతుందని చెబుతున్నారు. థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా ప్రభు త్వాలు తీసుకునే శ్రద్ధపైనే పరిస్థితి ఆధారపడుతుందని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి..అందరికీ వ్యాక్సిన్ వేసేలా సర్కారు చర్యలు చేపడితేనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయట పడగలం అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *