ఒంటరితనం వల్ల పురుషుల్లో కేనర్స్ ముప్పు..
మన చుట్టూ నలుగురు మనుషులు..నిత్యం స్నేహితులతో గడిపితే రోజులే తెలియవు. కానీ ఒంటరితనంగా ఉంటే టైం గడవదు సరికదా పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తుంటాయి. కాగా ఒంటరితనం అనుభవించే పురుషులపై దాదాపు 4 దశాబ్దాలపాటు జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. మిగతా వారితో పోలిస్తే ఒంటరి పురుషులకు కేన్సర్ ముప్పు అధికమని అధ్యయనం తేల్చింది. ధూమపానం ఎంత హానికరమో ఒంటరితనం కూడా అంతే హానికరమని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు 1980లో పురుషుల్లో ఒంటరితనంపై పరిశోధన ప్రారంభించారు. ఇందులో మొత్తం 2570 మంది పురుషులు పాల్గొన్నారు. నాటి నుంచి నిరంతరాయంగా పరిశోధన కొనసాగింది. అధ్యయనంలో పాల్గొన్న 649 (25 శాతం) మందికి కేన్సర్ సోకగా, 283 (11 శాతం) మంది మరణించారు. ఒంటరితనం కారణంగా కేన్సర్ ముప్పు 10 శాతం పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. ఇందుకు ఇతర పరిస్థితులు అంటే.. జీవన విధానం, ఆర్థిక పరిస్థితి, నిద్ర, ఒత్తిడి వంటివి కారణం కాదని, కేవలం ఒంటరితనం వల్లే ముప్పు పెరుగుతుందని తేల్చారు. పెళ్లి చేసుకోని వారు, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వారిలో కేన్సర్ మరణాలు రేటు కూడా అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు.