కరోనా అంతంపై సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయం..

ప్రపంచం అంతా కరోనాతో అతలా కుతలం అవుతోంది. మరి దీనికి అంతం ఏంటనేది ఎవరికి తెలీదు. కాగా కరోనాపై ప్రస్తుతం సమస్య జటిలంగా ఉందని, మహమ్మారి క్లిష్టదశకు చేరుకుందని చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్తగా పని చేస్తున్న సౌమ్యా స్వామినాథన్‌. రాబోయే 6 నుంచి 12 మాసాల కాలంలో ఏం చేయాలనేదానిపై మనం దృష్టి నిలపాల్సి ఉందని అన్నారు. ఇది చాలా గడ్డు దశగా ఉంటుందని అన్నారు. ఆ తర్వాతే మనం కరోనా తరిమివేత లేదా నియంత్రణ గురించి ఆలోచించగలమని సౌమ్య చెప్పారు. ఇంకా వైరస్ అంతిమంగా ఎలా రూపాంతరం చెందుతుందనేది కూడా ముఖ్యమని అన్నారు. టీకాల వల్ల కలిగే రోగనిరోధకత వ్యవధి, టీకాలు వివిధ రకాల వైరస్ రూపాంతరాల నుంచి ఎంతవరకు రక్షణ ఇవ్వగలవనే దానిపై కూడా అంతిమ అంచనా ఆధారపడి ఉంటుందని తెలిపారు. వైరస్ అంతం గురించి జోస్యం చెప్పడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త అంటున్నారు. 2021 చివరినాటికి ప్రతిదేశంలో, ప్రతి చోటా.. జనాభాలో కనీసం 30 శాతం మందికి టీకాలు పూర్తిచేయడం చాలా ముఖ్యమని సంస్థ భావిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కోవాక్స్ కార్యక్రమ లక్ష్యం ఇది. ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే కరోనా వైరస్ మరణాలు చాలావరకు తగ్గిపోవడం చూడగలుగుతామని ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో సౌమ్య చెప్పారు. ఆ తర్వాత 2022లో 60-70-80 శాతం సాధించగలమేమో చూడాలి.2022 చివరినాటికి టీకాల కార్యక్రమం గరిష్ఠంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ లోగా సమిష్టి రోగనిరోధకత ఏమేరకు పెరుగుతుందో చూడాల్సి ఉంది. ఆ తర్వాతే కరోనా వ్యాధి సాధారణ జలుబు వంటి అన్ని ఇతర సాధారణ వ్యాధుల్లాగే మారుతుందని అన్నారు. అప్పుడిక కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ గడపడం సాధ్యమవుతుంది. అందుకే రాబోయే 6 నుంచి 18 మాసాల గడువు కీలకమైనదిగా భావిస్తున్నట్టు సౌమ్య వివరించారు. దీర్ఘకాలికంగా ఏం జరుగుతుందనేది జోస్యం చెప్పడం కష్టమని, మహమ్మారి కీలక దశకు అంతం అనేది ఉంటుందని మాత్రం చెప్పగలమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచస్థాయి సహకారం చాలాచాలా ముఖ్యమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *