ఘోస్ట్ షిప్స్ గురించి మీకు తెలుసా..

మామూలుగా షిప్స్ గురించి అందరికి తెలుసు..మరి ఘోస్ట్ షిప్స్ గురించి మీకు తెలుసా.. గత కొన్నేళ్లుగా జపాన్ పడమటి తీరాల్లో ఘోస్ట్ షిప్స్ కనిపిస్తున్నాయి. మొదట్లో అందరూ ఇవి ఉత్తర కొరియా జాలర్లు వాడే పడవలని భావించారు. వీటిలోని చాలా పడవల్లో మనషుల మ‌ృతదేహాలు ఉంటున్నాయి.ఈ మధ్యకాలంలో కొన్ని పడవల్లో మనుషులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉత్తర కొరియా నుంచి వచ్చిన వారని తేలింది.జపాన్ పశ్చిమ తీరాలకు కొట్టుకువచ్చే ఈ పడవలు ఖాళీగా ఉంటాయి. కొన్నిట్లో మనుషుల శవాలు కూడా ఉంటాయి. 2017లో కొన్ని పడవలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇందులో కొందరు మనుషులు కూడా ఉన్నారు.నవంబర్‌లో ఇలాంటి ఓ బోటును అధికారులు గుర్తించారు. అందులో 8 మంది ఉన్నారు.తామంతా ఉత్తర కొరియా నుంచి వేటకు వచ్చిన జాలర్లమని, సముద్రంలో తప్పిపోయామని చెప్పారు.జపాన్ కోస్టు గార్డులు గుర్తించిన మరో పడవలో 10 మంది దాకా ఇలాంటి వారున్నారు.ఈ బోట్లన్నీ చాలా పాతవి. ధృడంగా లేనివి. వీటిలో అన్నీ పాతకాలం నాటి ఇంజిన్లే.. కనీసం దారి చూపేందుకు నేవిగేషన్ పరికరాలు కూడా అందులో లేవు.తీరానికి కొట్టుకువచ్చిన చాలా పడవల్లో దాదాపు అన్నిట్లోనూ శవాలే కనిపించాయి. వారంతా ఎవరు అనే విషయం మొదట్లో అర్థం కాలేదు.అయితే.. వీరంతా ఉత్తర కొరియా నుంచి వచ్చిన జాలర్లని, సాండ్ ఫిష్, కింగ్ క్రాబ్, స్క్విడ్ రకం చేపల కోసం గాలిస్తారని కొందరు ఊహించారు.పడవలపై కొరియా భాషలో కొన్ని అక్షరాలు కనిపించాయి. దీన్ని బట్టి వీరంతా ఉత్తర కొరియా ప్రాంతానికి చెందినవారని అధికారులు గుర్తించారు.. ఆ ప్రాంతంలో చేపల పరిశ్రమలు భారీగా ఉన్నాయి.ఈ మధ్య.. మనుషులతో పాటు ఒడ్డుకు కొట్టుకువచ్చిన పడవలో వ్యక్తులు తాము ఉత్తర కొరియాకు చెందినవారమని చెప్పారు. నవంబర్‌లో కనిపించిన బోటులో కూడా ఓ బోర్డు దొరికింది. ఆ బోర్డు ఆధారంగా ఈ పడవ ఉత్తర కొరియా మిలిటరీకు చెందినదని గుర్తించారు. దీంతో ఈ పడవలపై అనుమానాలు పెరిగాయి.మరోవైపు.. తమ పడవలు గల్లంతయ్యాయని కానీ, కనిపించడంలేదని కానీ ఉత్తర కొరియా ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.ఈ పడవలు శవాల గుట్టలతో ఒడ్డుకు కొట్టుకువచ్చినపుడు సాధారణంగా పోలీసులు ఆ శవాలను పరీక్షిస్తారు. కానీ ఆ శవాలు చాలా భాగం కుళ్లిపోవడంతో ఈ మరణాలకు కారణాలు కనుక్కోవడం కష్టమయ్యింది.బోటులో ప్రయాణించేటపుడు వెంటతెచ్చుకున్న ఆహారం తక్కువవడం.. ఆకలి, వణికించే చలి.. ఈ కారణాలతోటే బహుశా వీరందరూ మరణించి ఉండొచ్చు.పడవలు పాతవి కావడం, బలహీనంగా ఉండడం.. సముద్రంలో చాలా దూరం పోయాక పాడవడం.. ఇలాంటి కారణాలతో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఎ.ఎఫ్.పి. వార్తా సంస్థ ప్రకారం 2017లో 40 మంది ఉత్తర కొరియా జాలర్లను కాపాడారు. వీరంతా దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించిన ఉత్తర కొరియా పౌరులని కొందరి అభిప్రాయం.కానీ.. ప్రాణాలతో బయటపడ్డ వారు మాత్రం తమను తిరిగి ఉత్తర కొరియాకు పంపాలని కోరారు.జపాన్‌కు పడవలో చేరుకునే దారి చాలా ప్రమాదకరమైనది. వారు దేశం వదిలి పారిపోవాలనుకుంటే దక్షిణ కొరియాకు వెళ్లడం చాలా సులువు.కొందరు ప్రాణాలతో బయటపడినా.. ఇంకా చాలా బోట్లు తీరానికి కొట్టుకువస్తూనే ఉన్నాయి. ఆ పడవల నిండా మృతదేహాలే!నవంబర్‌లో జపాన్ కోస్ట్‌గార్డులు ఓ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు వీరంతా ఆ సముద్ర తీరంలోనే ఓ చోట ఆశ్రయం పొందారు.అక్కడ పోర్టులో ఆపివున్న ఓ జపాన్ బోటులోకి చొరబడి టీవీ, రైస్ కుక్కర్, ఇతర వంటింటి సామాగ్రిని తమ బోటులోకి తరలించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ దొంగతనాలు చేసినట్టు చివరకు ఆ నావికులే ఒప్పుకున్నారని కూడా మీడియా ధృవీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *