జాతీయస్థాయి మెడికల్‌ హబ్‌గా ఓరుగల్లు..

తెలంగాణాలోని చారత్రక నగరం ఏంటంటే ఓరుగల్లు అనే చెప్తారు. కాగా చారిత్రక నగరం ఓరుగల్లు జాతీయస్థాయి మెడికల్‌ హబ్‌గా మారనున్నది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో నిర్మిస్తున్నది. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) స్థాయి సేవలను ఈ దవాఖానలో అందుబాటులోకి తేనున్నది. సీఎం కేసీఆర్‌ ఈ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. వరంగల్‌ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.వెయ్యి కోట్లతో ఈ దవాఖానను నిర్మించనున్నారు. హాస్పిటల్‌ నిర్మించేందుకు వరంగల్‌ సెంట్రల్‌ జైలును తరలించారు. 59 ఎకరాల విశాలమైన స్థలంలో కొత్త దవాఖాన నిర్మాణం జరుగనున్నది. అత్యవసర వైద్య సేవలకు అనుగుణంగా ఎయిర్‌ అంబులెన్స్‌ (హెలిక్యాప్టర్‌)ను వినియోగించేలా హాస్పిటల్‌ భవనంపై హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి కూడా రోగులు వరంగల్‌కు వచ్చి వైద్యం చేయించుకునేలా, సీజనల్‌ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేవారికి అత్యవసర వైద్యసేవలు అందించనున్నారు. కెనడాలోని హాస్పిటళ్ల తరహాలో ఈ హాస్పిటల్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకోసం నిపుణుల బృందం కెనడాకు వెళ్లి అధ్యయనం చేయనున్నది. కొత్త హాస్పిటల్‌ భవనాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మించనున్నారు.రాష్ట్రంలోని ఏకైక వైద్య విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ వరంగల్‌లో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్యపరంగా వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ 2014లో హెల్త్‌ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయంగా దీనికి పేరు పెట్టారు. అనంతరం యూనివర్సిటీ కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. కాళోజీ వర్సిటీ కొత్త భవనాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రారంభిస్తున్నారు. దీంతోపాటు 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సైతం సీఎం ప్రారంభించనున్నారు.సీఎం కేసీఆర్‌ రాక నేపథ్యంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ స్థలాన్ని ఆదివారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీపీ తరుణ్‌జోషి, కలెక్టర్‌ ఆర్జీ హన్మంతును ఆదేశించారు. వీరి వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. వరంగల్‌లో కొత్త సెంట్రల్‌ జైలు నిర్మాణం కోసం 101 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇప్పటివరకు సెంట్రల్‌ జైలు ఉన్న స్థలాన్ని సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు నిమిత్తం వైద్య శాఖకు అప్పగించిన విషయం విదితమే. కొత్త సెంట్రల్‌ జైలు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి ఆ స్థలాన్ని జైళ్ల శాఖకు అప్పగించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రెవెన్యూ శాఖను ఆదేశించారు. అధికారులు ఖిలా వరంగల్‌ మండలం మామునూరులోని తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌లో 101 ఎకరాల స్థలాన్ని గుర్తించి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీంతో ఆదివారం ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను జైళ శాఖ ఇంచార్జి ఐజీ రాజేశ్‌ సమక్షంలో బెటాలియన్‌ కమాండెంట్‌ చేతుల మీదుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌రాయ్‌కి అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *