జూన్ చివరి నాటికి కోవిడ్ కేసులు తగ్గనున్నాయి..

కరోనా కరోనా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మహమ్మారి నుండి ఎప్పుడు బయటపడతామురా నాయనా అని వేచి చూస్తున్నారు జనం అంతా.అయితే కరోనా అంతం ఎప్పటికి అంటే జూన్ చివరి నాటికి దేశంలో కోవిడ్ కేసులు 15,000-25,000 స్థాయికి పడిపోతాయని నిపుణుల కమిటీ అంచనా వేస్తున్నది. కానీ టీకాల కార్యక్రమానికి చురుగ్గా చేపట్టి నియంత్రణలు పకడ్బందీగా అమలు చేయకపోతే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో థర్డ్‌వేవ్ వస్తుందని హెచ్చరించింది. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ముఖ్యమని శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల బృందానికి చెందిన డాక్టర్ ఎం విద్యాసాగర్ (ఐఐటీ హైదరాబాద్) తెలిపారు. ఈ బృందం గణిత నమనాలతో కోవిడ్ ఆటుపోట్లను అంచనా వేసి సర్కారుకు నివేదిస్తుంది. సెకండ్ వేవ్ రావడానికి ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం చాలావరకు కారణమనీ, అయితే తొలివేవ్‌లో పెంచుకున్న రోగనిరోధకతను కోల్పోవడమూ అందుకు దోహదం చేసిందని డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. ప్రజల్లో రోగనిరోధకత ఒకసారి అభివృద్ధి చెందితే దాని ప్రభావం 6 నుంచి 8 మాసాల వరకు ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. మే మధ్యనాటికి కరోనా ఉధృతమవుతుందని ఏప్రిల్ 2న కేంద్రాన్ని ముందస్తుగానే హెచ్చరించామని వెల్లడించి ఆయన ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సెకండ్‌వేవ్‌లో కరోనా సోకినవారి సంఖ్య ఫస్ట్‌వేవ్ కంటే 30 శాతం అధికంగా ఉంది. వారిలోని రోగనిరోధకత 6-8 మాసాల్లో తగ్గిపోతుంది. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి టీకాలు వేయడం మంచిదని డాక్టర్ విద్యాసాగర్ సూచించారు. అయినప్పటికీ ఈ గడువు తర్వాత.. అంటే 6-8 మాసాల తర్వాత కేసుల్లో స్వల్ప పెరుగుదల ఉంటుందని అన్నారు. అయితే అది సెకండ్ వేవ్ అంత ఉధృతంగా ఉండదని స్పష్టం చేశారు. తమ నమూనాల ప్రకారం జూన్-జులై మాసాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ఉదాహరణకు జూన్ చివరినాటికి 15,000-25,000 స్థాయికి తగ్గుతాయని వివరించారు. దానినే మనం సెకండ్ వేవ్ అంతంగా చూడొచ్చని అన్నారు. తమ కమిటీ అంచనాలు కొత్త వైరస్ రకాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాయని పేర్కొన్నారు. దేశంలోని వయోజనుల్లో 50-60 శాతం మందికి.. అంటే సుమారు 55 కోట్ల మందికి టీకాలు పూర్తిచేయాల్సి ఉందని అన్నారు. థర్డ్‌వేవ్‌ను తిప్పికొట్టేందుకు ఒకడోసు సరిపోతుందా లేక రెండు డోసులు కావాల్సిందేనా అనేది ఇంకా స్పష్టంగా తేలలేదు. వచ్చే జనవరి నాటికి 100 సకోట్ల డోసులు పూర్తి చేయగలిగితే మంచిదే. అంతకన్నా ఏమాత్రం ఎక్కువ చేయగలిగినా బోనస్ కిందే భావించాలని డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఇండియాలో గత కొన్నిరోజులుగా కొత్త కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *