జగన్ పుణ్యమా అని తెలంగాణకు మహర్దశ పట్టిందా.. అయ్యయ్యో!
వేమూరి వారు మళ్లీ గొంతెత్తారు. కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు రాశారు. జగన్ పుణ్యమా అని తెలంగాణ సీన్ రివర్స్ అయ్యిందట. చంద్రబాబు ఓడిపోవటం వల్ల అమరావతికి నష్టం జరిగితే, జగన్ సీఎం కావటం వల్ల తెలంగాణకు లాభం జరిగిందట. అదెలా అంటారా.. ఓసారి ఆ చెత్త పలుకులో ఏముందో ముందు చదవండి..
* రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అమరావతిలో భూములు కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఫలితంగా హైదరాబాద్‌లో భూముల ధరల పెరుగుదల మందగించింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని చంపేయాలనుకోవడంతో హైదరాబాద్‌కు మళ్లీ మహర్దశ పట్టుకుంది.
అదీ ఆర్కే లెక్క. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టారు. తెలంగాణలో భూములు అమ్ముకొని మరీ వెళ్లి పోయారు. అయితే తదుపరి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవటంతో అమరావతి తలరాత మారింది. జగన్ అధికారంలోకి రావటం, అమరావతిని చంపేయడం వల్ల ఆ తెలంగాణకు చెందిన పలువురు మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాద్ శివారులో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు తెలంగాణకు మహర్దశ పట్టుకున్నది. ఇది ఆయన చెప్పాలనుకున్నది.
వాస్తవం ఏంటంటే.. తెలంగాణ భూములకున్నగొప్ప విలువ ఇప్పటిది కాదు మహాశయా. నిజాం పాలనలో, హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఇలా ఎప్పుడు, ఎక్కడ చూసినా తెలంగాణ భూముల విలువ తగ్గిన చరిత్ర లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద హైదరాబాద్ భూముల ధరలు ఆధారపడి ఉన్నాయని రాయడం వెనుక తెలంగాణ ఇంకా బానిసనే అని చెప్పే ప్రయత్నమే అవుతుంది. పక్క రాష్ట్రంలో ఉండే ప్రతికూల, అనుకూల పాలన ప్రభావమే తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పడమే అవుతుంది. దేశంలోనే హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఏ సర్వే చూసినా తెలంగాణ భూముల విలువ ఏంటో తెలుస్తుంది. భౌగోళిక, ఆర్థిక, రాజకీయ ఇతర అన్ని రకాల పరిస్థితులు తెలంగాణ భూముల ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. అంతేగాని చంద్రబాబు లేదా జగన్ లేదా ఇంకోకడి వల్లనో తెలంగాణ మహర్దశలు, తలరాతలు మారవు. ఏపీ రాజకీయాలను తెలంగాణకు ముడి పెట్టి చూసే బుద్ధి మానుకుంటే ఇలాంటి విశ్లేషణలు ఇక మీదట రావని సలహా…