తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు..ఢిల్లీలో ఎగిరిన జెండా

తెలంగాణ ఏర్ప‌డి నేటికి ఏడేండ్లు అవుతోంది.ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. రాష్ట్ర
ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి కేఎం సాహ్ని జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్పల్‌తో క‌లిసి అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ వేడుక‌ల్లో తెలంగాణ భ‌వ‌న్ సిబ్బంది పాల్గొన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.కాగా తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా నిరాడంబ‌రంగా జ‌రిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిథులు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలంగాణ అవ‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో జ‌రిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.నల్లగొండ కలెక్టరేట్‌లో రాష్ట్ర‌ అవతరణ వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంత‌కుముందు న‌ల్ల‌గొండ క్లాక్‌ట‌వ‌ర్ వ‌ద్ద ఉన్న అమ‌రవీరుల స్థూపానికి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేటలో జ‌రిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక‌ల్లో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులు అర్పించిన ఆయ‌న క‌లెక్ట‌రేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడులు నిరాడంబరంగా జ‌రిగాయి. క‌రోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. పెద్దపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంత‌రం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *