దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కరోనా తోడయితే మరణమే..
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ కంటే చాలా డేంజర్ గా మారింది సెకండ్ వేవ్. ఈ వేవ్ లో మరణాల సంఖ్య కూడా ఎక్కువే.అసలు సెకండ్ వేవ్ లో మరణాల వెనుక ఏముందనే దానిపై ఐసీఎంఆర్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. గతేడాది భారత్ లో వ్యాపించిన కరోనా తొలిదశతో పోలిస్తే తాజాగా వెలుగుచూసిన రెండోదశలో మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఆక్సిజన్ కొరత ఇతరత్రా కారణాలతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల తీవ్ర వ్యాధులతో బాధపడుతూ కరోనా చికిత్స తీసుకున్న వారు కూడా మరణిస్తున్నారు. దీంతో కరోనాకు మరో రోగం తోడైతే ఇక చావు తప్పదన్న పరిస్ధితి చాలా చోట్ల కనిపిస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో సైతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. అమెరికా.. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే ఇది మూడో అత్యధికం. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఐసీఎంఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో మరణాలకు అసలు కారణాల్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ తాజాగా పది ఆస్పత్రుల్లో మరణాలపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో ముంబైలోని సియాన్ హిందూజాతో పాటు మరో 8 ఆస్పత్రుల్లో మరణాలపై ఐసీఎంఆర్ సమగ్ర వివరాలు సేకరించింది.ఆయా ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు వారికి అందుతున్న చికిత్స వారి హెల్త్ రికార్డ్ ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. వీటి ఫలితాలను తాజాగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాఢపడుతున్న వారు కరోనా బారిన పడితే మరణాలు తప్పడం లేదని ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా కరోనాతో పాటు మరో ఇన్ పెక్షన్ తో బాధపడుతున్న వారే ఈసారి ఎక్కువగా చనిపోతున్నట్లు ఐసీఎంఆర్ నిర్దారించింది. కరోనాతో పాటు మరో బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ ఫెక్షన్ తోడైతే మరణాలు తప్పవని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. ఈ ఇన్ పెక్షన్ కరోనా చికిత్స తీసుకుంటున్న సమయంలో కానీ పూర్తయిన తర్వాత కానీ తోడైతే మరణమే శరణ్యంగా మారుతోందని ఐసీఎంఆర్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలకు కోవిడ్ ఇన్ పెక్షన్ 10 శాతం కారణంగా తేలగా.. ఐసీఎంఆర్ అధ్యయనంలో మరో ఇన్ ఫెక్షన్ తోడైతే ఈ సంఖ్య 50 శాతం దాటేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ ఫెక్షన్ సోకిన కరోనా రోగులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని దానికి తగినట్లుగా యాంటీబయోటిక్స్ వాడకం అవసరమని ఐసీఎంఆర్ చెబుతోంది. మరోవైపు ఈ యాంటీబయోటిక్స్ శాతం ఎక్కువైనా బ్లాక్ ఫంగస్ వంటి రోగాలతో చనిపోతున్నట్లు ఇతర అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.