పసుపుగా మారిన నాలుక..ఇదో అరుదైన వ్యాధి..

టెక్నాలజీ పెరుగోతోన్న కొలది..పలు రోగాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి..పేరు తెలియని జబ్బులు కూడా భయపెడుతున్నాయి ప్రజలని. రోజుకో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి యావత్‌ మానవ జాతిని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో కొత్త రోగాలు రోజుకోటి పుట్టుకొస్తున్నాయన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. తాజాగా కెనెడాలో ఇలాంటి వింత వ్యాధి ఒకటి బయటకు వచ్చింది. కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు గొంతు, కడుపు నొప్పి, మూత్రంలో సమస్య, నాలుక పసుపు పచ్చగా మారడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తొలుత వైద్యులు పచ్చ కామెర్లుగా భావించారు. కానీ నాలుక అంతలా పచ్చగా మారడంతో వైద్యులు విస్తుపోయారు. వెంటనే డాక్టర్లు బాలుడికి పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో తేలిన వివరాల ప్రకారం ఆ బాలుడు అగ్లుటిన్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.ఇదొక అరుదైన వ్యాధిగా గుర్తించిన వైద్యులు ఇది ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అనే నిర్ణయానికి వచ్చారు.. అంటే శరీరంలోని రోగనిరోధక శక్తి ఎర్ర రక్త కణాలపై దాడి చేసి నాశనం చేస్తుందని వైద్యులు తెలిపారు. ఎప్‌స్టేన్‌ అనే వైరస్‌ సోకడం ద్వారా వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ ద్వారా బాలుడికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ వ్యాధికారణంగా ఎర్ర రక్తకణాలు వేగంగా విచ్ఛిన్నమవుతాయని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. ఈ ఎర్రరక్త కణాల విచ్ఛిన్నం కారణంగా బైలిరుబిన్‌ పెరిగిపోతుందని అంతిమంగా ఇది పచ్చకామెర్లకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చికిత్సలో భాగంగా బాలుడి రక్తాన్ని పూర్తిగా మార్చేశారు. 7 వారాల చికిత్స అనంతం బాలుడు కోలుకుంటున్నాడని, ప్రస్తుతం ఆయన నాలుక సాధారణ రంగుకు వస్తుందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *