మహిళల ఆరోగ్యం..అంతర్జాతీయ దినం
నేడు మే 28న మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ దినం సందర్భంగా ఆడవాళ్ల ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం. రోజూ మనం సహజంగా తీసుకునే ఆహారాల్లోనే అద్భుతమైన ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వాటిలో ఎంపిక చేసుకుని మరీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మహిళలు నిత్యం తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్‌లో ముఖ్యమైనవి పెరుగు, కొవ్వులుండే చేపలు, బీన్స్, టమాట, విటమిన్ డీ తక్కువ కొవ్వు ఉండే పాలు, నారింజ రసం, రకరకాల బెర్రీలు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేసే పరిపుష్టికరమైన ఆహార పదార్థాలలో చేపలు ఒకటి. చేపలలో ప్రోటీన్, విటమిన్ డీ, కాల్షియం, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉండడంతో పాటు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి. ఎంతో ముఖ్యమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందవచ్చు. టమాటాలు చాలా రకాల యాంటీ-ఆక్సిడెంట్లను, మినరల్లను కలిగి ఉంటాయి. టమాటలో ఉండే ‘లైకోపీన్’ అనే ఎరుపు రంగు వర్ణద్రవ్యం క్యాన్సర్ అభివృద్ధిని తగ్గిస్తుంది. మంచి ఆరోగ్యం, పెరుగుదల, బలమైన ఎముకలకు విటమిన్ డీ ముఖ్యమైనది. విటమిన్ డీ ఎక్కువగా సూర్య కాంతి నుంచి లభిస్తుంది. అలాగే, హెర్రింగ్, ట్రౌట్, ట్యూనా, సాల్మన్, మాక్రేల్ వంటి చేపల్లో కూడా విటమిన్ డీ లభిస్తుంది. బీన్స్ ను తప్పనిసరిగా ప్లేటులో ఉండేలా చేసుకోవడం ద్వారా ప్రోటీన్స్ , ఫైబర్ అంది గుండెపోటు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడం చాలా ప్రముఖపాత్ర పోషిస్తాయి. పీఎంఎస్, పెరీ మెనోపాజ్, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో బీన్స్ ఉపయోగపడతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. మార్కెట్లో అందుబాటులో ఉంటున్న బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్, గూస్బెర్రీస్ లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, తగినంత ఫైబర్ లభిస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు బ్లాక్ బెర్రీస్ , బ్లూ బెర్రీస్ ఎంతగానో పాటుపడతాయి.ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి..మహిళలు తమ ఆరోగ్య సమస్యలు ముందే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా రాకుండా నివారించుకోవచ్చు. కానీ చాలా మంది ఇంట్లో, ఆఫీస్ పనిలో పడి వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తీసుకునే ఆహారంపై కూడా దృష్టి పెట్టడం లేదు. దాంతో అన్ని వయసుల వారు ఆరోగ్య సమ్యలను ఎదుర్కొంటున్నారు. 11-12 ఏండ్ల వయసులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు హ్యూమన్ పాపిలోమా వైరస్ మందును తీసుకోవాలి.20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి యేటా మొత్తం బాడీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 21-29 ఏండ్ల వయసు మధ్య ఉన్నవారు పాప్ స్మియర్ టెస్టును రెగ్యులర్‌గా చేయంచుకోవాలి. 30 సంవత్సరాల వయసులో ప్రతి ఐదేండ్లకు ఒకసారి పాప్ టెస్ట్, హెప్స్ టెస్ట్ తరుచుగా చేసుకోవాలి. 40 ఏండ్ల వయసు వారు మమ్మోగ్రామ్, రొమ్ము ఎక్స్‌రే తీయించుకోవాలి. 45-50 ఏండ్ల వయసు వారు పెద్ద పేగు క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి.60 ఏండ్లు అంతకంటే పెద్దవారు ఎముకల బలం గురించి పరీక్షలు చేసుకోవాలి. మహిళలు ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ పనిలో మునిగిపోయి తమ ఆరోగ్యం చెకప్‌లను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య సంరక్షణపై కన్నేయాలి. అప్పుడే మొత్తం కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది.