మెట్రో టైమింగ్స్ పొడిగింపు
కరోనా తీవ్రత వల్ల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మెట్రో టైమింగ్స్ మారాయి. అయితే హైదరాబాద్ నగర వాసులకు ఇది శుభవార్తే. కరోనా నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో మెట్రో వేళలను ఆ మేరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే సడలింపు ఉండగా, నిన్న కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగించడంతోపాటు సడలింపు సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకు పొడిగించారు.ఈ నేపథ్యంలో మెట్రో వేళల్లోనూ మార్పులు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచే రైళ్లు ప్రారంభమవుతాయని, 12.45 గంటలకు సేవలు ముగుస్తాయని హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఉదయం 11.45 గంటలకు అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు బయలుదేరుతుందని తెలిపింది.అయితే, ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఫేస్‌మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలని, ఎప్పటికప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవాలని కోరింది. అలాగే, స్టేషన్లలోని భద్రతా సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.