యాదాద్రి పరిసరాల్లో లగ్జరీ హోటల్..రూ.100కోట్ల పెట్టుబడి..
సీఎం కేసీఆర్ యాదాద్రిని ఎంతో ప్రతిష్టాత్మకంగా సుందరంగా తీర్చి దిద్దేందుకు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నాలుగు నక్షత్రాల లగ్జరీ హోటల్ ఏర్పాటుకానుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆధునిక వసతులు, హంగులతో లక్ష్మీనివాసం డెవలపర్స్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ సంయుక్తంగా ఈ హోటల్‌ను నిర్మించనున్నాయి. ఈ ఆలయానికి సమీపంలో సుమారు రెండున్ర ఎకరాల స్థలంలో దాదాపు 400 గదులతో ఈ హోటల్ నిర్మిస్తామని లక్ష్మీనివాసం డెవలపర్స్ యజమాని రాజేంద్ర ప్రసాద్, ది పార్క్ నేషనల్ హెడ్ వికాస్ అహ్లువాలియా తెలిపారు. ఈ మేరకు హోటల్ ఏర్పాటుకు సంబంధించి రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాల మార్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ హోటలైనా సామాన్యులు, మధ్య తరగతి భక్తులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయని, సుమారు 500 నుంచి 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఆధునిక వసతులు, సకల సౌకర్యాలతో ఏర్పాటుకానున్న ఈ హోటల్ వచ్చే ఏడాది మార్చి 20న ప్రారంభం కానుంది. అప్పటికి హోటల్ మొదటి దశ పూర్తవుతుందని, 2023 జులై నాటికి మొత్తం 400 గదులతో పూర్తిస్థాయి హోటల్ అందుబాటులోకి రానుంది. హోటల్లోనే ఇండోర్ స్విమ్మింగ్‌పూల్, ఏసీ బంకెట్ హాల్, ఏసీ జిమ్, స్పా సెంటర్లు, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు ఉండనున్నాయి. అదేవిధంగా భక్తులను ఆలయం దగ్గరకు తీసుకెళ్లడానికి ఉచితంగా బస్సును కూడా ఏర్పాటు చేయనున్నారు.