రాహుల్ మెడకు రేవంత్ ఉచ్చు

‘దిన్ కే బాతోంసే కాం ఖరాబ్ రాత్ కే బాతోంసే నీంద్ ఖరాబ్’ అన్నట్లుంది రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి. ‘ఏ దిక్కు లేనోళ్లకు అక్క మొగుడే దిక్కన్నట్లు’ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లను పక్కనపెట్టి మూడేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పగ్గాలు అప్పజెప్పింది.

శేలు దప్పినోడు శేను వెడ్తె వడగండ్ల వానొచ్చి పోయిందని కాంగ్రెస్ పగ్గాలు చేతికందినప్పటి నుండి రేవంత్ యవ్వారం పట్ట వశం కాకుండ పోయింది. అసలే తీట నోరు .. అందుల పార్టీ అధ్యక్షుడాయె నోటికి, మాటకు లెక్క లేకుంట వొయ్యింది. ఓ లెక్కల చెప్పాల్నంటె ‘పిల్లలు లేని ఇంట్ల తాత అంబాడినట్లు’ అయింది కాంగ్రెస్ పార్టీల రేవంత్ కత.

దీపం ఉండంగనే ఇళ్లు సక్క వెట్టుకోవాలె అని రేవంత్ వచ్చీ రాంగనే దళిత, గిరిజన దండోరా అని సభలు మొదలువెట్టిండు. డబ్బులిచ్చి తరలిస్తారో ? కాళ్లు మొక్కి తరలిస్తారో ? నాకు తెల్వదు సభలకు జనాలను తోల్కరావాలె అని పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లకు టార్గెట్లు పెట్టిండు. కాంగ్రెస్ లో ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్, వీహెచ్, జగ్గారెడ్డి లాంటి సీనియర్లతో సంబంధం లేకుండా పార్టీ పూర్తిగా తన ఆధీనంలో ఉండాలి. అప్పుడే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు అమ్ముకోవచ్చన్నది రేవంత్ వ్యూహం. అసలే డబ్బులిచ్చి తెచ్చుకున్న పదవి. అందుకే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు.

అయితే రాజకీయాలు, విలువలు వంటివి రేవంత్ కు అవగాహన లేని అంశాలు. చంద్రబాబు తప్పిదాలకన్నా రేవంత్ నోటి తీటతోనే తెలంగాణల తెలుగుదేశం సంకనాకింది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ సొంత పార్టీ నేత శశిధరూర్ ను పట్టుకుని గాడిద, వాన్ని పార్టీ నుండి బహిష్కరించాలని అన్నాడు. అది కాస్తా వివాదం అయ్యేసరికి అనలేదని బుకాయించాడు. ఆడియో బయటకు వచ్చేసరికి తప్పయిందని తలపట్టుకున్నాడు. గల్లీలో ఆకు రౌడీ తరహా మెంటాలిటీ ఉన్న రేవంత్ కు కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చి ‘పాలకుండ కాడ పిల్లిని కావలి వెట్టినట్లు’ అయిందని పార్టీ సీనియర్లు లబో దిబ్బ మంటున్నారు.

శశిధరూర్ వివాదం సద్దుమనగక ముందే కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ అంటూ వైట్ ఛాలెంజ్ విసరడం సెల్ఫ్ గోల్ అని తప్పుపడుతున్నారు. గతంలోనే రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. అప్పట్లో రాహుల్ డ్రగ్ టెస్ట్ కు నిరాకరించాడు. అమెరికాలో డ్రగ్ కేసు నుండి బయటపడేందుకు రాహుల్ కు వాజ్ పాయ్ సాయం చేశారని ప్రచారం ఉంది.

ముందు వెనకా చూసుకోకుండా సమాజంలోని 99.99 శాతం మంది ప్రజలకు సంబంధం లేని డ్రగ్స్ అంశాన్ని రేవంత్ ఛాలెంజ్ చేయడం .. టెస్టులకు నేను రెడీ, రాహుల్ గాంధీని కూడా టెస్టులకు ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకువస్తే నేనూ వస్తా అని, అంతేగాని ఓటుకునోటు దొంగ సవాళ్లకు నేను సిద్దంగా లేనని కేటీఆర్ చెప్పడంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కొట్లాడడానికి సవాలక్ష సమస్యలుండగా రేవంత్ అవివేకంతో అనవసరంగా రాహుల్ గాంధీని వివాదంలోకి లాగాడని అంటున్నారు. ట్విట్టర్ లో #RahulDrugTest ట్రెండింగ్ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

‘ఆత్రపు పెళ్లికొడుకు అత్త మెడలో తాళి కట్టినట్లు’ అధికారం మీద ఆశతో రేవంత్ ఏం చేస్తున్నాడో కూడా సోయి లేకుండా చేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ వర్దంతికి కాంగ్రెస్ నేతలు వెళ్లకూడదని ఆదేశాలిచ్చిన రేవంత్ రాఖీ పండగకు సీతక్కను చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు పంపడం రేవంత్ ఇప్పటికీ తాను చంద్రబాబు బానిసనే అని చాటుకున్నట్లు అయిందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.

ఆంధ్రాలో 23 ఎమ్మెల్యే, కేవలం ఏడు జడ్పీటీసీలకు పరిమితమయిన చంద్రబాబు భజన ద్వారా రేవంత్ కాంగ్రెస్ కు పుట్టగతులు లేకుండా చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు డ్రగ్స్ పంచాయతీతో రాహుల్ చర్చానీయాంశం కావడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లుంది కాంగ్రెస్ పరిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *