స్టాలిన్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మోడీ..
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన డీఎంకేకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. తొలిసారి ప్రధాని మోడీని కలిశారు. ముఖ్యమంత్రి హోదాలో మోడీతో భేటీ సందర్భంగా తమిళనాడు ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను ఆయన ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. వీటిపై మోడీ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మరే ముఖ్యమంత్రికి ఇవ్వని వరాన్ని ఈ సందర్భంగా మోడీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తనకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని.. ఎప్పుడైనా కలవొచ్చని చెప్పారట. అయితే.. రాష్ట్ర సమస్యల పరిష్కారం విషయంలో అంటూ ట్యాగ్ కూడా జోడించారట. అయితే.. మోడీ ఇచ్చిన వరం ముందుచూపుతోనే అన్న మాట రాజకీయ వర్గాల నోటి నుంచి వస్తోంది.
మరో రెండుమూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఆ సమయానికి తమిళనాడులో స్టాలిన్ హవా నడుస్తూ ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో మోడీ పరివారానికి సీట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి వేళలో కొత్త మిత్రుల అవసరం ఉంది. ఆ ఎన్నికల సమయానికి డీఎంకే అత్యధిక ఎంపీ స్థానాల్ని కొల్లగొట్టే అవకాశం ఉంది. కొత్త మిత్రుడికి గాలం వేసే ప్రక్రియలో భాగంగానే మోడీ తాజా వరమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.