గులాబీ గూటికి ఎల్ రమణ.. నిజమేనా?
తెలంగాణలో ఇక టీడీపీ ఖాళీ అయినట్టే.. అడుగు బొడుగు ఉన్నా మొత్తం ఊడ్చుకుపోయినట్టే. ఎందుకంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో ఇప్పటికే చర్చలు జరిగాయి. గులాబీ కండువా కప్పుకొనేందుకు ఎల్ రమణ కూడా అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో మిగిలిన ఒకే ఒక్క కీలక నేత రమణ. ఇప్పటికే ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్లలోకి వెళ్లిపోయారు. వివిధ కారణాల వల్ల ఎల్ రమణ ఇప్పటివరకు టీడీపీతోనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఆయన కూడా పార్టీని వీడబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం టీడీపీలో ఉంటే భవిష్యత్ లేదని భావించి ఆయన గులాబీ గూటికి చేరనున్నట్టు తెలుస్తున్నది. కార్యకర్తలతో సమావేశమైన ఎల్ రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీగా అవకాశం?
ఎల్ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విషయంలో మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం. గతంలో ఆయన కూడా టీడీపీలో కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. పాత పరిచయాలతో ఎల్ రమణను టీఆర్ఎస్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని వినికిడి. ఇప్పటికే ఫోన్లో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. ఎల్ రమణ కూడా రాజకీయ భవిష్యత్ దృష్ట్యా అంగీకరించినట్టు వార్తలు వినవస్తున్నాయి. ఎల్ రమణతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ కాబోతున్నది.