చాయ్ డబ్బాను కూడా కార్పొరేట్ చేశారు కద రా..

ఆదిలాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం అది. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ బతికే వారి సంఖ్యే ఎక్కువ. ఆ గ్రామంలోనే 70 ఏళ్ల వయసున్న రాజయ్య తాత, తన భార్యతో కలిసి జీవనం కొనసాగించేవారు. రాజయ్య తాతది ఒకప్పుడు పెద్ద కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలతో ఇళ్లు నిండుగా ఉండేది. పెద్ద చదువులు చదివించకపోయినప్పటికీ, బతుకుదెరువుకు అవసరమైనవి పిల్లలకు నేర్పించాడు. ఉపాధి కోసం పట్నం బాట పట్టిన కొడుకులు అక్కడే స్థిరపడిపోగా, అప్పో సొప్పో చేసి ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లను చేశాడు. ఉపాధి కోసం పోయి కొడుకులు దూరం కాగా, పెళ్లిళ్లు కావడంతో బిడ్డలు దూరం అయ్యారు. కొడుకులతో కలిసి పట్టణంలో ఉండాలంటే రాజయ్య తాతకు, అవ్వకు ఇష్టం లేదు. ఎలా అయినా సరే, గ్రామంలోనే బతకాలని నిర్ణయించుకొని గ్రామంలోనే ఉంటున్నారు. రాజయ్య తాతకు చిన్న గుడిసె తప్ప పొలం లేదు, ఇతర ఆస్తులు లేవు. ఉన్నదళ్లా ఒక చాయ్‌ బండి మాత్రమే. ఆ చాయ్ బండి తోనే జీవితం గడిపాడు. పిల్లల్ని పెంచి పోషించాడు. పెళ్ళిళ్ళు చేశాడు. చాయ్ డబ్బుతో 40 ఏళ్ల అనుబంధం ఆయనది. రాజయ్య తాత చాయ్ అంటే, చుట్టు పక్కల నాలుగు మండలాలకు ఫేమస్. తయారు చేయడమే చాలా స్పెషల్. అల్లం చాయ్, ఇలాచి చాయ్ ఈ రెండు రకాలు మాత్రమే ఉండేవి. కానీ, దేనికదే ప్రత్యేకం. కేవలం 5 రూపాయలకే రుచికరమైన చాయ్‌ అందించేవాడు. తల నొప్పి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం తో పాటు, ఆ చిక్కటి చాయ్ ఊదుకుంటు తాగితే, పాణం ఉషార్ అయ్యేది. నలుగురు దోస్తులు కలిస్తే చాలు.. ఈ తాత దగ్గరికి వచ్చి చాయ్ తాగాల్సిందే. తాతతో మాట్లాడాల్సిందే. పొద్దుగూకే దాకా ముచ్చట్లు చెప్పుకోవాల్సిందే.

చాయ్‌ అమ్మగా వచ్చిన డబ్బుతో సరుకులు తెచ్చుకుని ముసలవ్వతో కలిసి ఆనందంగా గడిపేవాడు. ఉదయం, సాయంత్రం చాయ్‌ అమ్మడం, వచ్చిన డబ్బుతో జీవించడం వారికి ఎప్పటినుంచో అలవాటుగా మారింది. అలా రాజయ్య తాత జీవితం సంతోషంగా గడుస్తుండగా, ఒక రోజు వారి జీవితంపై కార్పొరేట్ మహమ్మారి కన్ను పడింది. వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. డి టైం (పేరు మార్చాం). అదేదో ఫ్రాంచేసి మోడల్ అట. ఐదు లక్షలు ఖర్చుతో ఒక డబ్బా తెచ్చి తాత చాయ్ బండి పక్కన పెట్టాడు. 15 రకాల చాయ్ లు ఉంటాయని బొమ్మలు పెట్టాడు. మంచి రంగులు వేసి, లైట్లు పెట్టి జిగేల్ మనెలా చేశాడు. బయట కుర్చీలు వేసి, టేబుల్లు పెట్టాడు. ఈ హంగులను చూసిన ప్రజలు రాజయ్య తాత పాత చాయ్‌ డబ్బా వద్దకు కాకుండా, డి టైమ్ వద్దకు వెళ్లడం మొదలు పెట్టారు. ఇన్నాళ్ళ నుండి తక్కువ ధరకే వచ్చిన రాజయ్య తాత చాయ్ చీప్ అయ్యింది. డి టైం వద్ద ఒక్కో చాయ్ కి రూ. 20 ఖర్చు చేసి అయినా తాగేందుకు అక్కడి ప్రజలు సిద్ధమయ్యారు. తాత చాయ్ డబ్బాకి క్రమంగా గిరాకీ తగ్గింది. 5 రూపాయల చీప్ చాయ్ వద్దు అంటూ, రుచి, పచి లేకున్నా, 20 రూపాయల కాస్లీ చాయ్ తాగడం అక్కడ ప్రెస్టేజ్ గా మారింది. నెలన్నర గడిచింది. తాత గిరాకీ క్రమంగా తగ్గిపోయింది.
ఎక్కువ లాభం చూసుకోకుండా కేవలం 5 రూపాయలకే ఛాయ్‌ అమ్మిన తాత వద్ద నిల్వ డబ్బు ఏముంటుంది. అందుకే ఆర్థికంగా ఇబ్బంది మొదలైంది. కార్పొరేట్ హంగులను చూసిన తాత, అవ్వకి ఇక మనం ఇక్కడ మనుగడ సాగించడం కష్టం అని అర్థం అయ్యింది. ఈ విషయం వారి కొడుకులకు చెప్పగా, హైదరాబాద్ వచ్చి ఉండండని, మీకు ఇష్టం ఉంటే, చాయ్ బండి పెట్టండని, ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు. పట్నంలో బతకడం ఇష్టం లేకపోయినప్పటికీ, అయిష్టంగానే ముందుకు కదిలారు రాజయ్య తాత, అవ్వ. ఊరు వదలి వెళ్తున్నామని నిర్ణయం తీసుకున్న రోజు నుండి తాత మనసు మనసులో లేదు. తల్లిని వదిలి వెళ్లిపోతున్నట్లు బాధపడ్డడు. పట్నానికి పయనమైన రోజు తాత చాయ్ బండి వద్దకు వచ్చి ఏడ్చారు. బతుకు మొత్తం దాని మీదే సాగింది కదా, అందుకే కడుపు నుంచి బాధ తన్నుకువచ్చినట్లుంది. వెక్కివెక్కి ఏడ్చాడు. ఊరోళ్లందరు సముదాయిస్తుండగా, బారంగా అడుగులు వేసుకుంటూ, పట్నం వైపు కదిలాడు.

ఉన్న ఊరును తల్లి లాంటి ఉపాధిని వదిలి వెళ్ళిన తాత హైదరాబాద్ లో అప్పటికే విస్తరించిన డి టైం వంటి కార్పొరేట్ సామ్రాజ్యం చూసి భయపడ్డాడు. ఖాళీగా ఇంట్లోనే ఉంటూ.. తన ఊరును, చాయ్ బండిని గుర్తు చేసుకుంటూ బాధ పడుతూ ఉన్నాడు. గ్రామంలో ఎంతో యాక్టివ్‌గా ఉన్న రాజయ్య తాత నెల రోజుల్లోనే కుంగిపోయారు. ఇక తన బతుకు ఇక్కడేనా అంటూ బాధపడుతూ, కొద్ది రోజుల్లోనే మంచం పట్టాడు. అనారోగ్యం పాలై చివరకు ప్రాణాలు వదిలాడు. ఏడుస్తూ వెళ్లిన రాజయ్య తాత శవమై సొంత గ్రామానికి చేరాడు.

ఇక గ్రామంలో ప్రారంభించిన డి- టైం 6 నెలల్లోనే క్లోజ్ అయ్యింది. కొద్ది రోజులు బాగనే నడిచినా తర్వాత మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తలో 20 రూపాయల ధర చెల్లించి అయినా తాగేందుకు ఆసక్తి చూపిన వారు క్రమంగా దూరమయ్యారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అప్పు తెచ్చి మరీ, 5 లక్షల పెట్టుబడితో డి- టైం పెట్టారు. సోషల్‌ మీడియాలో ప్రచారం చూసి తాము కూడా లాభ పడతామని అనుకున్నారు. కాని వాస్తవం వేరు. తెచ్చిన అప్పు తిరిగి కడతామనే నమ్మకం లేక, కనీసం వడ్డీ కట్టేంతగా ఆదాయం రాక నాలుగు నెలల్లోనే మూసివేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఆ యువకులు రోడ్డున పడ్డారు. ఉపాధి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు యువకుల్లో నేనూ.. ఒకడిని. 5 లక్షల నష్టం వచ్చిదంటే కూడా, రాజయ్య తాత జీవితాన్ని డిస్ట్రబ్‌ చేశాను అనే బాధ మా ఇద్దర్ని కలిచి వేస్తున్నది. ఎవరికి వారు, నచ్చిన ఏ వ్యాపారం అయినా చేసుకునే హక్కు అందరికి ఉంటుంది. కాని మనం చేసే కొన్ని తప్పులకు మనకు తెలియకుండానే బాధ్యులం అవుతాం. ఈ ఒక్క రాజయ్య తాత జీవితాన్ని నేను డిస్ట్రబ్‌ చస్తే, ఎంతో మంది రాజయ్య తాతల జీవితాలను కార్పొరేట్‌ డిస్ట్రబ్‌ చేసింది.
నిజంగా, నేను ఎంతో బాధతో చెబుతున్నాను. రాజయ్య తాత, ఆ అవ్వ జీవితాలను మాకు తెలియకుండానే ప్రభావితం చేసాము. మేము కూడా ఎంతో నష్ట పోయాం. మారుమూల గ్రామాల్లోకి సైతం అడుగుపెట్టిన కార్పొరేట్ మహమ్మారి చిన్న వ్యాపారుల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్నది. సంపాదన అనే భ్రమలో పడి క్వాలిఫికేషన్ సైతం మరిచిన విద్యార్థులు, విద్యా స్థాయికి దిగజారుతున్నారు. తర్వాత మోసపోతున్నారు. చదువుకోలేని వారు, వృద్ధులు, ఇతర అవసరాలు ఉన్నవారికి ఉపాధి నిమిత్తం చాయ్ బండ్లు పెట్టు కుంటారు. ఈ అవకాశాన్ని కార్పొరేట్‌ తనవశం చేసుకుంటున్నది. సోషల్‌ మీడియా ప్రచారంతో మభ్యపెట్టి, ఫ్రాంచైజీ పేరిట లక్షల వసూలు చేస్తూ, నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నది. ఈ భ్రమలో పడి డిగ్రీలు, బీటెక్, ఉన్నత విద్య చదివిన వారు సైతం మోసపోతున్నారు. వారికి తెలియకుండానే చిన్న బతుకులపై ప్రతికూల ప్రభావం చూపి, జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. డిగ్రీలు, బి టెక్‌లు, ఇతర ఉన్నత చదువులు చదివిన వారు కూడా కార్పొరేట్‌ భ్రమలో పడటం బాధాకరం. చిన్న ఆలోచనలతో సరిపెట్టుకోకుండా, ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త ఉపాధి మార్గాలు సృష్టించాలని, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి అని కోరుతున్నాను.

-నా పేరు లెనిన్
అభివృద్ది నోచుకోని ప్రాంతం వాసిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *