కాంతారలో ఎముందంత..?

అరేయ్ కాంతార చూశావా అని మొన్న దోస్తు అడిగితే చూడలేదు రా అన్నాను. అయ్యో ఇంకా చూడలేదా.. మస్త్ ఉంది. వెంటనే చూడు. ఇప్పటికే రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిందని వాడు చెప్పాడు. అయితే ఖచ్చితంగా చూడాల్సిందే అని అనుకున్నాను.

నిన్న కొంచె టైం దొరికితే, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూద్దామని ఫేస్ బుక్ ఓపెన్ చేశాను. కిందకు మీదకు రోల్ చేస్తూ చూస్తుంటే, కాంతార గురించి మెసేజ్‌లు కనిపించాయి. అందులో చాలా మది సినిమా సూపర్ అని, అసలు ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమాలు తీయడం చేతగాదు అని రాశారు. అటు దోస్తులు, ఇటు సోషల్ మీడియలో అందరు బాగుంది అంటున్నారు. కాబట్టి, ఈ సినిమా చూడాల్సిందే అని రెండోసారి అనిపించింది.

అందుకే ఇంటికి రాగానే, డిన్నర్ చేసి కాంతార మూవీని ఓటీటీలో చూడటం మొదలు పెట్టాను. పెద్ద టీవీ, మంచి సౌండ్ సిస్టం కాబట్టి ఇంట్లోనే ఉండి థియేటర్లో కూర్చున్న అనుభూతిని పొందటం నాకు అలవాటు. ఇక సినిమా స్టార్ట్ అయ్యింది. అర గంట అయ్యింది. దోస్తులు చెప్పినట్లు ఎక్కడా అనిపించడం లేదు. గంట అయ్యింది. సోషల్ మీడియాలో చెప్పినట్లు గొప్పగా లేదు. గంటన్నర అయ్యింది, రెండు గంటలు గడిచింది. బోర్ కొడుతున్నది. దోస్తుకు ఫోన్ చేశాను. ఏమైందిరా ఈ సినిమాలో ఇంత పెద్దగా ఏముంది అన్నాను. లాస్ట్‌లో చూడు మస్తుంటది అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేసి చివరి దాకా చూసాను. నిజమే లాస్ట్‌లో ఒక 25 నిమిషాలు అనుకుంటా, బాగుంది. అంతే.

మా దోస్తుకు మళ్లీ కాల్ చేశా.. అంతేనా సినిమా అంటే. అవును అంతే అన్నాడు. దీనికేనా అన్ని కోట్లు వసూలు అయ్యింది అంటే, అవును అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేసా. బయట జరుగుతున్న ప్రచారం అంతగా కాంతార సినిమా లేదు. ప్రచారం జరుగుతున్నది రూపాయి అంత అయితే, వాస్తవం చారాణ అంత. కొంత వరకు బాగుంది అని చెప్పొచ్చు కానీ, తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు ఎందుకు తీయదు అని ప్రశ్నించేంతగా ఏం లేదు. యావరేజ్ సినిమా ఇది.

అయితే ఈ సినిమా ఎందుకు ఇంత నచ్చింది, ఎందుకు ఇంత ప్రచారం జరుగుతున్నది అని ఆలోచిస్తే, నాకు కొన్ని కారణాలు దొరికాయి.

1, ప్రజలకు పని తక్కువ అయ్యింది. ఎంటర్టైన్మెంట్ కోరుకోవడం ఎక్కువైంది. కేవలం 8 గంటల పాటు పని చేసి, మిగతా సమయం మొత్తం మొబైల్స్, టీవీ, సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారు. కెరియర్‌కు ఉపయోగపడేదో లేదా జీవితం మరింత వృద్ధి చెందేందుకు అవసరం అయ్యే కోర్సులు చేయడమో, పుస్తకాలు చదవడమో, నైపుణ్యాలు పెంచుకోవడమో వంటి వాటిపై అస్సలు దృష్టి లేదు.

2, అకలి లేకున్నా టిఫిన్, లంచ్, డిన్నర్ ఠంచన్‌గా తింటున్నట్లే, రోజుకు ఒకటి రెండు సినిమాలు ఓటీటీలో చూడటం అలవాటుగా మారింది. తెలుగు, తమిళ్, మలయాళీ, హిందీ, ఇంగ్లీష్.. ఇలా భాషలతో సంబంధం లేకుండా పిచ్చెక్కినట్లు సినిమాలు చూస్తున్నారు. దీంతో కొత్త సినిమాల కొరత వారికి ఏర్పడుతున్నది. సినిమా విడుదలైతే చాలు వెంటనే ఆ సినిమాలు చూడటం అలవాటుగా మారింది. కొంత బాగుంటే చాలు చూసిన వారే మళ్లీ మళ్లీ అదే సినిమాను చూస్తున్నారు. ప్రమోట్ చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు.

3, మంచి స్టోరీతో వస్తున్న సినిమాలు కాలు వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి. పెద్ద హీరోలుగా చెప్పుకునే వారు ఏడాదికి ఒకటి తప్ప పెద్దగా తీయడం లేదు. ఇక మిగిలింది యువ హీరోలు. వీరిలో చాలా మంది కూడా పెద్దగా ప్రయోగాలు చేయకుండా సేఫ్ జోన్లో ఉంటూ సినిమాలు తీస్తున్నారు. ఇక కాంతార వంటి కొత్త స్టోరీతో సినిమాలు రావడం అరుదుగా మారింది. సినిమా పెద్దగా లేకపోయినా, దొరికిందే బొక్క అన్నట్లు జనాలు ఫీల్ అవుతున్నారు. ఆ సినిమాలను హిట్ చేస్తున్నారు. తెలుగులో వచ్చిన కార్తికేయ 2 కు కూడా ఇది వర్తిస్తుంది.

4, ఇన్నాళ్లూ లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, కామెడీ స్టోరీలతో విసిగి వేసారిన జనాలు ఇప్పుడు కొత్త దనం కోరుకుంటున్నారు. హీరోయిజం చూపించే సినిమాల కంటే, వాస్తవ పరిస్థితులను థియేటర్ తెర మీద చూపించే సినిమాలను ఆదరిస్తున్నారు. కాంతార సినిమా చివరి 25 నిమిషాలు అద్భుతంగా తీశారు. దీని కోసమే మిగతా సినిమా అంతా ఓపిగ్గా చూడటం నా వల్ల కాదు. గమ్యం ఒక్కటే అద్భతంగా ఉండకూడదు. ప్రయాణం కూడా అద్భుతంగా ఉండాలి. అలాగే సినిమా క్లైమాక్స్ కొద్ది నిమిషాలు బాగుంటే చాలదు. మొత్తం సినిమా బాగుండాలి. అప్పుడే కోట్లు కొల్లగొట్టడం కాదు, ప్రజల మన్ననలు చూగగొంటది. ఇటీవల వచ్చిన సినిమాల్లో పుష్పా, విక్రం ఇందుకు ఉదాహరణలు.

నా అభిప్రాయం చెప్పుకునే హక్కు నాకుంది. దాన్ని గౌరవించడం మీ బాధ్యత. సద్విమర్శలకు నేను ఎప్పుడూ సిద్ధమే.

-మీ కత్తి రెడ్డి, జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *