భారత్ పై అమెరికా ప్రశంసలు..అదేంటో చూద్దాం..
భారత్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది. పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్ కీలకపాత్ర పోషిస్తున్నదని మెచ్చుకున్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసుకున్నదని అమెరికా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన దౌత్య అధికారి జాన్ కెర్రీ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ ప్రకటన చేసింది. జాన్ కెర్రీ ఏప్రిల్ 5 నుంచి 8 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌లతో కెర్రీ భేటీ కానున్నారు. పర్యావరణ మార్పుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పనిచేసే విషయమై జాన్ సంప్రదింపులు జరుపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలతో చర్చలు జరుపనున్నారు. కాగా ఈ నెల 22, 23 తేదీల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ సహా ఇతర దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యావరణ సదస్సును నిర్వహించనున్నారు.