అందుకే భారత్ లో కరోనా ప్రభావం తక్కువ!

కరోనా.. ప్రపంచ దేశాలను వణికించిన మహమ్మారి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఈ వైరస్ దెబ్బకు అల్లాడిపోయాయి. ఇప్పటికీ అమెరికాలో లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అటు యురోపియన్ దేశాల్లో కూడా ఈ వైరస్ బారిన పడి లక్షల మంది మృతి చెందారు. ఆసియా దేశాలు అందులోనూ ఇండియా విషయానికి వస్తే కరోనా ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా గల దేశంలో కరోనా ఇంకా ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. ఎంత మందిని పొట్టన బెట్టుకుంటుందో అన్న ఆందోళన మొదట్లో వ్యక్తమైనా.. పరిస్థితి మాత్రం మరీ అంతగా దిగజారలేదు. ప్రస్తుతమైతే కేసులు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీనికి కారణం ఏంటన్నది చాలా మందికి అంతుబట్టలేదు. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లోని కల్యాణిలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్‌ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సీక్రెట్‌ను కనుగొన్నారు. ఆసియా దేశాలతో పోలిస్తే యూరప్‌, ఉత్తర అమెరికా దేశస్థులలో ఉండే ఓ ప్రొటీన్ లోపం కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులకు కారణమని తేల్చారు.

ఆ ప్రొటీన్ మన వద్ద పుష్కలం

కరోనా వేగంగా విస్తరించడానికి న్యూట్రోఫిల్ ఎలాస్టేస్ అనే ప్రొటీన్ కారణమని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రొటీన్ మానవ కణాల్లోకి వెళ్లి, వేగంగా వ్యాప్తి చెంది వైరస్‌ను కూడా అలాగే వ్యాప్తి చెందేలా చేస్తోంది. ఈ ప్రొటీన్‌కు చెక్ పెట్టడానికి మన జీవ వ్యవస్థ మరో ప్రొటీన్‌ను రిలీజ్ చేస్తుంది. దీని పేరు ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ (ఏఏటీ). ఈ ఏఏటీ తక్కువగా ఉంటే న్యూట్రోఫిల్ ఎలాస్టేస్ ప్రొటీన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడీ ప్రొటీనే ఆసియా వాసులతో పోలిస్తే.. యూరప్‌, అమెరికా వాసుల్లో చాలా తక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. ఇదే అక్కడ కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమని అధ్యయనం తేల్చింది. దీనికి సంబంధించిన ఫలితాలను ఇన్ఫెక్షన్‌, జెనెటిక్స్‌, ఎవాల్యుషన్ జర్నల్‌లో ప్రచురించారు.

అక్కడ చాలా వేగంగా..

కరోనా వైరస్ మ్యూటెంట్ అయిన డి614జీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకేలా వ్యాపించలేదని ఈ సైంటిస్టులు నిదన్ బిశ్వాస్‌, పార్థ మజుందార్ గుర్తించారు. ఈ మ్యూటెంట్ 50 శాతం వేగంగా వ్యాప్తి చెందడానికి ఆసియాలో 5.5 నెలల సమయం తీసుకోగా.. యూరప్‌లో 2.15 నెలలు, ఉత్తర అమెరికాలో 2.83 నెలలే తీసుకున్నట్లు చెప్పారు.

వేడి వాతావరణం వల్ల కాదు

చాలా మంది ఆసియాలో, ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందకపోవడానికి ఇక్కడి వేడి వాతావరణం కారణమని భావించారు. కానీ దీని వెనుక ఓ జీవ సంబంధ కారణం ఉంటుందని తాము విశ్వసించినట్లు మజుందార్ వెల్లడించారు. ఈ ఏఏటీ ప్రొటీన్ లోపం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియాలో చాలా తక్కువని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు చెప్పారు. ప్రతి వెయ్యి మందిని తీసుకుంటే.. తూర్పు ఆసియా దేశాలైన సింగపూర్‌లో కేవలం 2.5 మందికి, మలేషియాలో 8 మందికి మాత్రమే ఈ ప్రొటీన్ లోపం ఉండగా.. స్పెయిన్‌లో ఇది 67.3, యూకేలో 34.6, ఫ్రాన్స్‌ లో 51.9, అమెరికాలో 29 మంది ఈ ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నారు. ఈ కారణంతోపాటు ఇతర సామాజిక కారణాలు కూడా కరోనా వ్యాప్తిలో ఉన్న తేడాలను వివరించినట్లు ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *