అందమైన ‘తెలంగాణ’..పెరిగిన 3శాతం పచ్చదనం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఆరు విడతలుగా విజయవంతమైన హరితహారం ఏడోదశ కొనసాగుతుంది. 230 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే లక్ష్యానికి చేరువయ్యారు. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని పర్యావరణవేత్తలు తెలిపారు. గత మూడేళ్ల నుంచి సమృద్దిగా వర్షాలు కురవడం కూడా పచ్చదనం పెరగడానికి ఒక కారణం.
ప్రముఖ పర్యావరణ వేత్త, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ తెలంగాణలో పచ్చదనం పెరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ అడవుల్లోని పచ్చదనం ఎంత అందగా ఉందో తెలిపే అద్భుతమైన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘అందమైన తెలంగాణ.. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం.. తక్కువ సమయంలో 3 శాతం పచ్చదనాన్ని పెంచుకుంది. వరంగల్‌లోని ఆకర్షణీయమైన ఈ పచ్చటి అడవులను (Lush green forests of Warangal) చూడండి’ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.దేశంలో అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్ఎస్ఐ) రెండేళ్లకోసారి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణతకు సంబంధించిన అంశాలను సర్వే చేస్తుంది. భారత అటవీ సర్వే 2019 లెక్కల ప్రకారం.. తెలంగాణ అటవీ విస్తీర్ణం 163.31 చ.కి.మీ. పెరిగింది. ఇక, తెలంగాణలో కేవలం వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనే దట్టమైన అడవులు ఉన్నాయి.