ఆరు నెలల అన్వేషణ..కొత్త మొక్క గుర్తింపు..

పరిశోధకులు..నిత్యం ఏదో ఒక దానిని కనిపెట్టేందుకు తమ కృషిని చేస్తూనే ఉంటారు. కాగా రీసెంట్ గా హిమఖండం అంటార్కిటికాలో కొత్త వృక్ష‌జాతిని భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. పంజాబ్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌ల బృందం ఆ కొత్త మొక్క‌ను తూర్పు అంటార్కిటికాలో గుర్తించారు. నాచు మొక్క‌ల‌కు బ్ర‌య‌మ్ భార‌తీనిసెస్ అని శాస్త్రీయ నామ‌క‌ర‌ణం చేశారు. హిందువుల దేవ‌త స‌ర‌స్వ‌తీ దేవి పేరు మీద‌ భార‌తి అని పేరు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అంటార్కిటికాలో ఉన్న ఇండియ‌న్ స్టేష‌న్‌ను కూడా భార‌తి పేరుతో పిలుస్తారు. కొత్త మొక్క ఆవిష్క‌ర‌ణ‌కు సంబంధించిన విష‌యాల‌ను ఆసియా-ప‌సిఫిక్ బ‌యోడైవ‌ర్సిటీ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.2016-17 స‌మ‌యంలో భార‌తీయ శాస్త్ర‌వేత్త‌ల బృందం అంటార్కిటికాలో ప‌ర్య‌టించింది. ప్రొఫెస‌ర్ ఫెలిక్స్ బ‌స్త్ ఆ బృందానికి నాయ‌క‌త్వం వ‌హించారు. ఆరు నెల‌ల అన్వేష‌ణ‌లో.. లార్స్‌మాన్ హిల్స్ ప్రాంతంలో కొత్త మొక్క‌ను గుర్తించారు. ఆకుప‌చ్చ రంగులో ఆ నాచు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. భార‌తి స్టేష‌న్‌కు స‌మీపంలో దీన్ని గుర్తించ‌డం వ‌ల్ల దానికి ఆ పేరు పెట్టారు.మొక్కలు పెర‌గాలంటే నైట్రోజ‌న్‌, పొటాషియం, పాస్ప‌ర‌స్‌, సూర్య‌ర‌శ్మి, నీరు కావాల్సి ఉంటుంద‌ని, అంటార్కిటికాలో కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే మంచు లేకుండా ఉంటుంద‌ని, కానీ ఇలాంటి మంచు రాళ్ల‌పై ఎలా ఈ నాచు మొక్క‌లు మొలుస్తున్నాయో అధ్య‌యనం చేయాల్సి ఉంటుంద‌ని ప్రొఫెస‌ర్ బ‌స్త్ తెలిపారు. పంజాబ్ వ‌ర్సిటీలో బాట‌నీ శాఖ అధిప‌తి అయిన బ‌స్త్‌.. 2017 ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో కొన్ని శ్యాంపిళ్ల‌ను సేక‌రించారు. వ‌ర్సిటీ ల్యాబ్‌లో వాటిని ప‌రీక్షించారు. ఆ బృందంలో వాహిద్ ఉల్ రెహ్వాన్‌, బ‌టిండా కీర్తి గుప్తాలు కూడా ఉన్నారు. అంటార్కిటికా నుంచి తెచ్చిన నాచు కొత్త‌గా క‌నుగొన్న‌ట్లు స్ట‌డీ ద్వారా తేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *