ఈ బాణం ఎవరు వదిలారబ్బా..?

తెలంగాణ రాజకీయాలకు కొత్త ఊపువచ్చింది. నిన్నమొన్నటి దాకా నిశబ్ధంగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రంజుగా మారాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు.. తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టడం అందరిని ఆకర్షిస్తోంది. అయితే.. షర్మిల త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. నల్లగొండ జిల్లా నేతలతో సమావేశంతో తెలంగాణలో రాజకీయ అడుగులకు అంకురార్పణ చేసినట్టుగా తెలుస్తోంది. షర్మిలకు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటీ..? అది కూడా తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పని ఏంటనేది ఇప్పుడు అసలు చర్చనీయాంశం.
షర్మిల తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వినిపిస్తున్న మాట మాత్రం వైఎస్ జగన్ తో విభేదాలు. తన అన్నతో గొడవల కారణంగానే షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అందుకే లోటస్ పాండ్ లో జరిగిన సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జగన్ ఫొటో లేకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం. ఇదంతా కూడా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ యాక్షన్ ప్లాన్ అనే ప్రచారం కూడా ఉంది. జగన్ జైళ్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు షర్మిల. తెలంగాణ ప్రాంతంలోనూ పర్యటించారు. వైసీపీ క్యాడర్ లో నూతనోత్సాహం తీసుకొచ్చారు. ప్రతిఫలంగా జగన్ తనకు ఏమీ చేయలేదనే ఫీలింగ్ లో ఉన్నారట షర్మిల. తనను రాజ్యసభకు పంపిస్తారని షర్మిల చాలా ఆశలు పెట్టుకున్నారట. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అటు.. బ్రదర్ అనిల్ కుమార్ కూడా దీనిపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బ్రదర్ అనిల్ కుమారే ఇప్పుడు వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
జగన్, షర్మిల మధ్య విభేదాలు నిజమే అనడానికి మరిన్ని అంశాలు కూడా బటయపడ్డాయి. తెలంగాణలో పార్టీ పెట్టాలన్న షర్మిల నిర్ణయంతో వైఎస్సార్సీపీకి సంబంధం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని జగన్ తమతో చెప్పారన్నారు సజ్జల. అందుకే తాము తెలంగాణలో పార్టీని విస్తరించలేదని.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు కూడా తాము వ్యతిరేకం అని ప్రకటించారు. షర్మిలకు జగన్‌ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు. షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. అన్ని జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి.. నెల రోజుల తర్వాత పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు పాదయాత్ర కూడా చేసేందుకు షర్మిల ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం.

అప్పడే మొదలైన విమర్శలు..

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు స్పందించారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు స్పందించారు. జగన్ పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడ్డారని, అన్నపై కోపం ఉంటే ఏపీలో పార్టీని పెట్టాలని గానీ, తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని అన్నారు. వైఎస్ నుంచి లబ్ధిపొందిన వాళ్ళు షర్మిలకు సహకరించే అవకాశం ఉందని, ఒక సామాజిక వర్గం షర్మిలకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని వీహెచ్ పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమే అని, తెలంగాణలో ఓట్లు చీల్చి లబ్ది పొందాలని చూస్తోందన్నారు. షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగ పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. షర్మిల ఇతర పార్టీలకు మేలు కోసం రాజన్న పేరును వినియోగించొద్దన్నారు. కొన్ని పార్టీల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉపయోగ పడొద్దన్నారు. రాజీవ్ రాజ్యం అయినా రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి వేరు వేరు కాదన్నారు. ఆమె పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలోనే బయట పడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *