ఒక్క బాయ్‌ఫ్రెండైనా ఉండాల్సిందే..

అమ్మాయిలకు కాలేజీ వింత సర్క్యులర్

‘అమ్మాయిలూ.. మీ అందరికీ వ్యాలైంటైన్స్ డే నాటికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే. ఇది మీ భద్రత కోసమే. లేకపోతే.. కాలేజీలో అడుగుపెట్టనీయ్యం.. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారితో కలిసి దిగిన ఫొటోలను కూడా మాకు చూపించాలి’ ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కాలేజీ సర్క్యులర్. ఇది చాలదన్నట్టు.. ప్రేమను పంచండి అంటూ సర్క్యులర్ చివర ఓ సలహా కూడా ఉన్నదండోయ్. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ఉన్న ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైనట్టు కనిపిస్తున్న ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నది. ప్రొఫెసర్ అశిశ్ శర్మ సంతకంతో జనవరి 14న ఇది జారీ అయినట్టు ఉన్నది.

తొలుత విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో బయటపడ్డ ఈ ఆదేశాలు క్రమంగా సోషల్ మీడియా బాట పడ్డాయి. ఈ పరిణామంతో మండిపడుతున్న విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ స్పందించారు. ఇది కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ అశిశ్ శర్మ అనే అధ్యాపకుడు తమ కాలేజీలో లేరని స్పష్టంచేశారు. ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని, బాధ్యులను వెతికిపట్టుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమ్మాయిలను హడలెత్తించేందుకు ఫైనలియర్ విద్యార్థులెవరైనా ఈ తుంటరి పనికి పూనుకొని ఉండొచ్చని కాలేజీవర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక ఆగ్రాలోని ప్రముఖ కాలేజీల్లో ఒకటైన సెయింట్ జాన్స్‌ ను 1850లో బ్రిటిషర్లు ఏర్పాటుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *