కరోనాకి బలి అయిన సీనియర్ జర్నలిస్ట్..
మరో సీనియర్ జర్నలిస్ట్ ని బలి తీసుకుంది కరోనా మహమ్మారి. పశ్చిమబెంగాల్లో ప్రముఖ టీవీ యాంకర్లలో ఒకరైన అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. గత నెల 14న కరోనా బారినపడిన ఆయన దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం వైరస్ నుంచి కోలుకున్న ఆయన డిశ్చార్జీ అయ్యారు. అయితే మళ్లీ కరోనా సంబంధిత సమస్యలు తిరగబెట్టడంతో మరోమారు దవాఖానలో చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటీలేటర్‌పై ఉంచారు. అయితే నెలరోజుల పాటు మహమ్మారితో పోరాడిన ఆయన మృతిచెందారు. జర్నలిజంలో 33 ఏండ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన బందోపాధ్యాయ్.. జీ 24 గంటలు బెంగాలీ చానల్‌కు ఎడిటర్‌గా వ్యవహరించారు. అనంతరం అటునుంచి ఆనంద్ బజార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈమధ్యే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన టీవీ 9 బెంగాల్ న్యూస్ చానల్లో చేరారు. ఆ చానల్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారినపడ్డారు.