కరోనా కొత్త లక్షణం రక్తం గడ్డ కట్టుకుపోవడం..

కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో వృద్ధులే కాదు మధ్య వయసు వారు, చిన్న వయసు వారు కూడా హఠాత్త్ మరణం చెందుతున్నారు. కరోనా అనేక రూపాలతో విజృంభిస్తోందనడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇప్పటి వరకు  కొవిడ్ ను కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగానే పరిగణించిన డాక్టర్లు, సైంటిస్టులు.. ఇప్పుడది రక్తనాళాలపైనా తీవ్రంగా ప్రభావం చూపుతోందనే నిర్ధారణకు వచ్చారు. కొవిడ్ కారణంగా రక్తం గడ్డ కట్టుకుపోయి ఇతర అవయవాలపై ఆ ప్రభావం పడుతోందని, చిన్న వయసు వారు కూడా హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతుండటానికి ఈ పరిణామమే కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఏడాదిన్నర కాలంలో అనేక వేరియంట్లుగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ గురించి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రధాన టార్గెట్ ఊపిరితిత్తులే అయినప్పటికీ, కొవిడ్ ను రక్తనాళాలకు సంబంధించిన వ్యాధిగానూ పరిగణించాల్సిన అవసరం ఉందని, వైరస్ కాటుకు గురైనవారిలో 14 నుంచి 28 శాతం మందిలో రక్తం గడ్డ కట్టుకుపోతున్నట్లు గుర్తించామని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకడం వల్ల చాలా మందిలో రక్తనాళాల్లో అడ్డంకులు (థ్రాంబోసిస్‌) ఏర్పడుతున్నాయని, దీంతో సడెన్ గా గుండెపోటు లాంటివి తలెత్తడంతోపాటు కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, వీనస్‌ థ్రాంబోసిస్‌, అరుదుగా గ్యాంగ్రీన్‌ కూడా తలెత్తుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత గంగారామ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అంబరీష్ సాత్విక్.. కరోనా వల్ల రక్తం ఎలా గడ్డకడుతున్నదో ఫోటోలతోసహా బయటపెట్టారు. చాలా మంది కొవిడ్ రోగుల్లో రక్త నాళాలు గడ్డ కట్టినట్లు గమనించామని, సరైన సమయానికి చికిత్స అందించకుంటే రక్తం గడ్డల కారణంగా హార్ట్ అటాక్, స్ట్రోక్, అవయవాలు కోల్పోవడం వంటి పరిణామాలకు దారి తీస్తుందని ఆయన చెప్పారు. తాను చికిత్స అందించిన ఓ కొవిడ్ రోగిలో కాళ్లలోని రక్త నాళాల గడ్డలకు సంబంధించిన ఫొటోలను డాక్టర్ సాత్విక్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ”ఈ గడ్డకట్టిన రక్తాన్ని కొవిడ్ పాజిటివ్ పేషెంట్ అవయవాల నుంచి తొలగించి ఆయనను బతికించామ”ని డాక్టర్ పేర్కొన్నారు. వైరస్ సోకిన ఐదు రోజులకే కొవిడ్ పేషెంట్లలో రక్తం గడ్డ కట్టుకుపోతున్న ఉదంతాలు న్యూయార్క్ లో ఎక్కువగా వెలుగుచూశాయని, ఇప్పుడు భారత్ లోనూ ఆ తరహా కేసులు పెరుగుతున్నాయని, వీటిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని డాక్టర్ సాత్విక్ తెలిపారు. కరోనాతో 30-40 ఏళ్ల వయసున్నవారు కూడా హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతుండటానికి రక్తం గడ్డలే కారణం అయిఉండొచ్చన్నారు. చాలా కేసుల్లో వైరస్ సోకిన ఐదు రోజుల్లోనే రక్తం గడ్డ కట్టుకుపోతుండటాన్ని గుర్తించామని, ప్రాథమిక దశలోనే దానిని గుర్తించి చికిత్స అందించకుంటే గుండెపోటు, అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *