కుక్కల ఆలనా పాలనా చూస్తే ఏడాదికి రూ. 24లక్షలు..ఎక్కడో తెలుసా..
చాలామందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బుజ్జి బుజ్జి కుక్కపిల్లలతో ఎంచక్కా ఆడుకుంటుంటారు.. తీరిక దొరికితే చాలు వాళ్ల పెట్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు. ‘రోజంతా ఇలా బుజ్జి కుక్కలతో ఉంటే ఎంత బాగుంటుందో’ అని అనుకుంటుంటారు. అలాంటి వారి కోసం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నగరంలో ఓ మంచి ఆఫర్ ఉంది. పెట్స్‌పై మమకారం ఉన్నవారికి ‘చీఫ్ పప్పీ ఆఫీసర్’(సీపీఓ)గా ఉద్యోగం ఇస్తామంటోంది ‘యప్పీ.కామ్’ అనే సంస్థ. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుక్కపిల్లల్ని ముద్దుచేస్తూ వాటితో ఆడుకుంటూ ఆలనాపాలనా చూడ్డమే వీరు చేయాల్సిన పని. పెంపుడు కుక్కలను చూసుకోవడమే కదా జీతం పెద్దగా ఉండదులే అనుకోకండి. ఈ ఉద్యోగానికి ఏడాదికి ఏకంగా రూ.24లక్షలు ఆఫర్ చేస్తోంది. కుక్కల్ని సంతోషంగా ఉంచే ఈ ఉద్యోగం చేస్తే అటు డబ్బులకు డబ్బులూ వస్తాయి… ఇటు పెట్స్‌తో ఆడుకునే సంతోషం మిగులుతుంది. ఈ ఉద్యోగమేదో భలే ఉంది కదూ. ఇంకెందుకు ఆలస్యం ఇంట్రస్ట్ ఉంటే మీరూ దరఖాస్తు చేసుకోండి. ఈ పప్పీ ఆఫీసర్ కావాలనుకునేవాళ్లు ఆగస్టు 31వ తేదీలోపే యప్పీ.కామ్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.