కొండలు ఎక్కుతోన్న చేప..ఎక్కడనుకుంటున్నారు..!

ఫిష్ అదేనండి చేపలు ఎక్కడ ఉంటాయి అంటే ఇదేం ప్రశ్న నీటిలోనే కదా ఉంటాయి అనుకుంటారు అంతా..కానీ ఈ చేప కొండలు..ఎక్కేస్తుంది ఏకంగా.. హవాయి దీవుల్లోని ఓప్ చేప జలపాతాలలోని రాళ్లపై పాకుతూ సుమారు 300 మీటర్ల వరకు ప్రయాణించి ఎగువకు చేరగలుగుతుంది.ఇవి ఈ ప్రాంతానికే పరిమితమని, వీటి గురించి తెలిసిందీ తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.హమకువా తీరం వెంబడి ఉన్న సెలయేర్లలో ఈ ఓప్ చేపలు ఎక్కువగా కనిపిస్తాయని యూఎస్ జియలాజికల్ సర్వే అనుబంధ ‘హవాయి కోపరేటివ్ పిషరీ రీసెర్చ్ యూనిట్’ హెడ్ టిమ్ గ్రాబోవ్‌స్కీ చెప్పారు.సుమారు 80 కిలోమీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో సెలయేర్లు ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు వెళ్లడానికి వీలున్నవి తక్కువే.అలాంటి ఒక క్లిష్టమైన మార్గంలో నా ప్రయాణం సాగి ఒక సెలయేరుకు చేరింది.ఈ ఓప్ చేపలు తమ నోరు, ఉదరం కింద ఉండే రెక్కల వంటి భాగాల సహాయంతో జలపాతాలలోని రాళ్లపై పాకుతూ ఎగువకు చేరుతాయి. ఇలా ఇవి సుమారు 300 మీటర్ల ఎత్తు వరకు కొండలు ఎక్కగలవు.ఓప్ చేపలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి.సాధారణంగా గోధుమ వర్ణంలో కనిపించే ఇవి అవి ఉన్న పరిసరాలలో ఇమిడిపోతూ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంటాయి.గోబీ జీవకుటుంబానికి చెందిన ఓప్ చేపలు నాలుగు జాతులున్నాయి.ఇందులో ఒక రకంలోని మగ చేపలు సంతతి వృద్ధి చేసుకునే సీజన్‌లో సగం నల్లగా, సగం మెరిసే నారింజ రంగులో కనిపిస్తాయి. ఇవి తప్ప మిగతావన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి.ఓప్ జాతి చేపలన్నీ ప్రవాహం వెంట ఒక నిర్ణీత ప్రాంతంలోనే నివసించేందుకు ఇష్టపడతాయి.వీటిలో జలపాతాల వెంబడి గుట్టలపైకి ఎగబాకే రకం చేపలైతే ప్రవాహంలోని మారుమూల ప్రాంతాలు, లోతైన ప్రాంతాలలో ఉంటాయి.ఏడాదికి సగటున 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే హవాయి ద్వీపంలోని హమకువా తీరం జలపాతాలతో అలరారుతుంది.హవాయి దీవుల్లో ఒకటైన హిలో ప్రాంతం ‘మౌనా కీ’ అగ్నిపర్వతం సమీపంలో ఉంటుంది.ఈ పర్వతం సముద్రంలో ఒక పెద్ద గోడలా కనిపిస్తుంది. నీటి అడుగున ఉన్న దాని బేస్ నుంచి కొలిస్తే 10,211 మీటర్ల ఎత్తుంటుంది. ఆ లెక్కన చూస్తే ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన పర్వతం.ఈ ప్రాంతంలోని ప్రవాహాలు తక్కువ దూరమే ఉంటాయి కానీ నిటారుగా ఉంటాయి. అంతేకాదు.. ఆకస్మిక వరదలకూ తరచూ కారణమవుతాయి. ఇక్కడి మంచి నీటి ప్రవాహాలలో అయిదు జాతుల ఓప్ చేపలు ఉంటాయి.వీటిలో నాలుగు జాతులకు చెందిన ఓప్ చేపలకు రాళ్లపైకి పాకే ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది.హవాయి మంచినీటి చేపల గురించి పెద్దగా అధ్యయనం జరగలేదని, ఓప్ చేపల ప్రాథమిక జీవలక్షణాలు, జీవావరణం గురించి ఇప్పటికీ తెలియాల్సింది ఎంతో ఉందని ‘గ్రాబోవ్‌స్కీ’ అంటారు.మిగతా చేపల్లా కాకుండా ఇవి ప్రవాహాలు, జలపాతాల్లోని రాళ్లపై పాకగలగడానికి వీటి శరీర నిర్మాణం కారణమని ‘నైరుతి పసిఫిక్ అధ్యయన కేంద్రం’ ఆక్వాటిక్ రీసెర్చ్ ఎకాలజిస్ట్ రిచర్డ్ మెకంజీ చెప్పారు.వీటి ఉదరం కింద ఉండే రెక్కలు(ఫిన్) ఏదైనా ఉపరితలాన్ని తాకిన తరువాత అతుక్కుపోయేలా చేయగలుగుతాయి. అలా ఉదరం కింది రెక్క, నోటి సహాయంతో రాళ్లపైకి పాకుతుందీ చేప.ఇలా ఇవి ఎంతదూరం, ఎంత ఎత్తుకు వెళ్లగలవన్నది వాటి పరిమాణం బట్టి ఉంటుంది.సాధారణ ఈ చేపలు గరిష్ఠంగా ఒక అడుగు పొడవు వరకు పెరుగుతాయి.అలాగే ఇంతకుముందు చెప్పినట్లు సగం నలుపు, సగం నారింజ రంగులో ఉండే ఓపు చేపలు ఎక్కువ ఎత్తు వరకు వెళ్లగలుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *