గబ్బిలాలను పూజిస్తోన్న గ్రామస్థులు..

గబ్బిలాలు చూస్తేనే చిరాకుగా ఉంటుంది. గబ్బిలాలను దరిద్రం అని కూడా అనుకుంటాం..కానీ గబ్బిలాలను పూజిస్తున్నారట. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో మాధవరం పోడు, గంగు రాజుపోడు అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఒకప్పుడు గంగు రాజుపొడు గ్రామం వర్షాలు, పంటలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గ్రామం. కానీ ఒక రోజు అనుకోకుండా ఆ గ్రామంలోకి గబ్బిలాలు ఒక్కసారిగా వలసవచ్చి చేరాయి. ఆ గ్రామంలోని ఓ భారీ వృక్షంపై ఆవాసం ఏర్పరచుకున్నాయి. అంతే కొన్ని రోజులలోనే గంగు రాజు పొడు గ్రామం ఆర్థికంగా, వ్యవసాయ రంగంగా సుభిక్షంగా మారిపోయింది. పంటలు కూడా బాగా కురవడంతో గబ్బిలాలు తమ గ్రామంలోకి వచ్చాకే ఇలా మంచి జరుగుతుందనే రైతులందరిలో నమ్మకం ఏర్పడింది. దీంతో ఆ గ్రామంలో గబ్బిలాలు ఉన్న ప్రాంతం, చెట్లకు గ్రామస్థులు పూజలు చేస్తూ వచ్చారు.అయితే కొన్ని రోజులకే గంగు రాజుపోడు గ్రామంలో అనుకోని సమస్యలు, పంటలు నష్టం, గొడవలతో అశాంతి నెలకొంది. తమ గ్రామంలో ఉన్న గబ్బిలాలు ఒక్కసారిగా మాయం కావడమే ..దానికి కారణమని ఆ గ్రామస్థులు భావిస్తున్నారు. కొంతమంది వేటగాళ్లు వచ్చి గబ్బిలాలను చంపితినడం వల్ల అవి పక్క గ్రామంలోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గబ్బిలాలు తమ గ్రామాన్ని విడిచి వెళ్లినప్పటి నుంచి తమ గ్రామంలో సరిగ్గా పంటలు పండటం లేదని, నిత్యం గ్రామ సభ్యుల మధ్య కొట్లాటలతో గ్రామంలో ప్రశాంత వాతావరణం పాడైయ్యిందని చెబుతున్నారు. గబ్బిలాలు వేరే గ్రామానికి వెళ్లిపోవడం తమ గ్రామం పాలిట శాపంగా మారిందని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.గంగు రాజు పొడు గ్రామానికి సమీపంలోనే మాధవరం పోడు అనే గ్రామముంది. ఇక్కడ దాదాపు 450 కుటుంబాలు నివసిస్తుంటాయి. గంగు రాజు పోడు గ్రామం నుంచి వెళ్లిపోయిన గబ్బిలాలు..సమీపంలోని మాధవరం పోడు గ్రామంలోకి వచ్చాయి. మాధవరం పొడు గ్రామంలో అనుకోకుండా కొన్ని రోజులకే అభివృద్ధి, పచ్చని పొలాలు,ఆర్థికంగా గ్రామం సుభిక్షంగా మారింది. పచ్చని పొలాలతో రైతుల కంట ఆనందం నెలకొంది. గబ్బిలాలు తమ గ్రామంలోకి రావడం అదృష్టమని.. అవి తమ గ్రామానికి వచ్చినందునే గతంలో గొడవలు, కొట్లాటలతో అశాంతి నెలకొన్న తమ గ్రామంలో ఇప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా పచ్చని పంట పొలాలతో ఎంతో అభివృద్ధి చెంది సుభిక్షంగా వుందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఆ పక్షులకి ఎటువంటి హాని జరగకుండా తమ గ్రామస్థులు రక్షణగా వుంటున్నారు. అక్కడి ప్రజలు ఆ గబ్బిలాలను అపశకునంగా కాదు.. సాక్షాత్తు దేవత పక్షులే తమ గ్రామం లో కొలువు తీరాయాని నిత్యం పూజలు చేస్తుంటారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ గబ్బిలాల మలంతో వారి పిల్లలకు స్నానం చేపిస్తే పక్షి దోషాలు తొలగి ఆరోగ్యంగా వుంటారని గ్రామస్తుల ప్రగడ నమ్మకం..హిందు సాంప్రదాయ ప్రకారం చింత చెట్టు, గబ్బిలాలను అరిష్టంగా భావిస్తారు. అయితే ఆ గ్రామస్థులు మాత్రం నిత్యం ఆ గబ్బిలాలకు..అవి నివాసముంటున్న చింత చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. గబ్బిలాల మలంతో పిల్లలకు స్నానం చేయిస్తున్నారు. వాటి శబ్దాలనే మంచి శకునంలా భావిస్తున్నారు. అవి ఉండడం వల్లే తమ గ్రామం పంటపొలాలతో ఎంతో సుభిక్షంగా ఉందని మాధవరం పోడు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి గబ్బిలాలంటే వణికిపోతున్నాయి చాలా గ్రామాలు. అయితే ఆ గ్రామస్థుల పాలిట గబ్బిలాలు దేవత పక్షులు అయ్యాయి. ఆ గబ్బిలాలు ఉన్నందునే తమ గ్రామం సుభిక్షంగా మారిందని ఓ గ్రామస్థులు చెబుతుండగా.. అవే గబ్బిలాలు తమ గ్రామం నుంచి వెళ్లిపోవడంతో తమ గ్రామానికి దరిద్రం పట్టుకుందని మరో గ్రామం వారు చెబుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఈ మధ్య కరోనా వైరస్ చైనాలో గబ్బిలాల నుంచే పుట్టిందన్న కథనాల నేపథ్యంలో..వాటి పేరు చెబితేనే చాలా మంది గజగజ వణికిపోతారు. అయితే అలాంటి గబ్బిలాలను దేవత పక్షులుగా భావించే గ్రామాలు తన తెలుగు రాష్ట్రంలోనే ఉండటం ఆసక్తికరమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *