గ్రీన్ హోమ్ లో ఎన్నో ప్రత్యేకతలు..
పచ్చదనాన్ని ఇష్టపడేవారు మొక్కలు పెంచడం మానరు. అయితే స్థలం లేకపోతే ఏం చేస్తాంఅనుకుంటున్నారా..బాత్ రూంలో పెంచమంటున్నారు వీణాలాల్. ఆమె అదే పని చేస్తున్నారట. పర్యావరణాన్ని మనం పరిరక్షించకున్నా పర్వాలేదు కానీ.. పర్యావరణాన్ని మనం నాశనం చేయకూడదు… అని నమ్ముతుంది వీణ. అందుకే.. తన వంతుగా కాంక్రీట్ తో ఇల్లు కట్టుకోకుండా.. వెరైటీగా ప్రకృతికి దగ్గరగా ఉండేలా ఇల్లును నిర్మించుకుంది వీణ. ఆమెది ఫరీదాబాద్. 2003లో ఆమె తన డ్రీమ్ హోమ్ ను కట్టుకునేందుకు కొంత ఇంటి స్థలం తీసుకుంది. అప్పటి వరకు తను కిరాయికి ఉండేది. అయితే.. తనకు కాంక్రీట్ తో కట్టిన ఇండ్లు అంటే అస్సలు నచ్చవు. ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా.. సహజసిద్ధంగా జీవించేలా ఇల్లు కూడా ఉండాలని తను కోరుకునేది. ప్రకృతి నుంచి వచ్చే దేన్నయినా వేస్ట్ చేయకూడదని.. అవి పరిమితంగా దొరుకుతాయని నమ్మే తత్వం ఆమెది.ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ అమోల్ మానెకర్ అనే వ్యక్తిని సంప్రదించి తన డ్రీమ్ హోమ్ గురించి చెప్పింది. తనకు నచ్చిన విధంగా పర్యావరణానికి హాని కలిగించని ఇల్లు కావాలని ఆయనకు తెలపడంతో మూడేళ్ల కింద తనకు నచ్చిన డ్రీమ్ హోమ్ ను నిర్మించగలిగింది వీణ.తన 1800 చదరపు గజాల స్థలంలో మట్టితో ఇల్లును నిర్మించుకుంది. తక్కువ సిమెంట్ ను ఉపయోగించి.. ఎటువంటి టైల్స్ లేకుండా ఏసీలు గట్రా లేకుండా.. తన ఇల్లును నిర్మించుకుంది. దాన్నే గ్రీన్ హోమ్ గా నామకరణం చేసింది. మట్టితో చేసి ఎండబెట్టిన ఇటుకలను ఉపయోగించి ఇల్లును నిర్మించి.. గోడలను మట్టితో ప్లాస్టర్ చేయించింది. దాని వల్ల.. ఇల్లు ఎప్పుడూ కూల్ గా ఉంటుంది. ఫ్యాన్లు, ఏసీల అవసరమే ఉండదు. ఆ ఇటుకలను కూడా తనే సొంతంగా మట్టితో తయారు చేసుకుంది. స్లాబ్ ను లోకల్ గా తయారు చేసిన టైల్స్ తో వేయించింది. ఫ్లోరింగ్ ను పెద్ద పెద్ద రాళ్లతో సెట్ చేయించింది. తన ఇంట్లో ఉండే వాష్ బేసిన్స్, కిచెన్ సింక్స్ అన్నీ రాయితో చేసినవే.ఆ ఇంట్లో రెండు బాత్ రూమ్స్, ఒక డ్రాయింగ్ రూమ్, కిచెన్, సపరేట్ డ్రై టాయిలెట్ ను నిర్మించింది వీణ. టాయిలెట్ లో ఎక్కువగా నీళ్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా.. ఫ్లష్ ను డైరెక్ట్ గా డ్రమ్ కు లింక్ చేశారు. అలాగే.. తన టాయిలెట్ లో అరటి చెట్టుతో పాటు పలు రకాల చెట్లను పెంచుతోంది వీణ. అరటి చెట్టు వేర్లు టాయిలెట్ వాటర్ ను క్లీన్ చేస్తాయి. అందుకే.. బాత్ రూమ్ లో అరటి చెట్లను పెంచుతోంది. ఇంటికి సోలార్ పవర్ కనెక్షన్ కూడా పెట్టించింది వీణ. మొత్తం మీద అసలు ఈ కాంక్రీట్ జంగల్ లో గ్రీన్ హోమ్ ను నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది వీణ.