టీమిండియా ఘోర ఓటమి
చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నది. అనూహ్యమైన బౌన్స్, టర్న్ తో పిచ్చెక్కించిన చివరి రోజు పిచ్‌పై రెండు సెషన్లపాటు కూడా నిలవలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో 227 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఇంగ్లండ్ 4 టెస్ట్ ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ కోహ్లి (72) కాసేపు పోరాడినా.. టీమ్ ఓటమిని మాత్రం అడ్డుకోలేకపోయాడు. మిడిలార్డర్‌లో రహానే (0), పుజారా (15), పంత్ (11), సుందర్ (0) దారుణంగా విఫలమవడం టీమిండియా కొంప ముంచింది. రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌటైంది.
తొలి సెషన్‌లోనే..
వికెట్ నష్టానికి 39 పరుగులతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఓటమి తొలి సెషన్‌లోనే దాదాపు ఖరారైంది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ ధాటికి టీమ్ మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. 58 పరుగుల వద్ద పుజారా (15) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి కొంత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ వెంటనే స్కోరు 92 పరుగుల వద్ద గిల్ ఔటవడంతో పతనం మొదలైంది. రహానే (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. పంత్ (11), సుందర్ (0) కూడా పెవిలియన్ చేరారు. లంచ్ సమయానికి టీమిండియా 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ తర్వాత అశ్విన్ (9)తో కలిసి కోహ్లి కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. ముందు అశ్విన్, ఆ వెంటనే స్టోక్స్ బౌలింగ్‌లో అనూహ్యమైనలో బౌన్స్ కు కోహ్లి బోల్తా కొట్టడంతో టీమ్ ఆశలు గల్లంతయ్యాయి. పిచ్‌పై బౌన్స్ ఊహించిన స్థాయిలో లేకపోవడంతో బ్యాట్స్ మెన్ ఆడటానికి ఇబ్బంది పడ్డారు.