తల్లిపాలల్లో విటమిన్లు..ప్రోటీన్లు..

ఈ మధ్య కాలంలో బిడ్డకి ఎంతమంది తల్లిపాలను ఇస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్యాకెట్..డబ్బా పాలు పట్టడం ఫ్యాషన్ అయిపోయింది. మరి తల్లిపాలు మంచివా..డబ్బా పాలు మంచివా అంటే..తెలుసుకుందాం రండి. తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుంచి 6 నెలల వయసు వరకు, అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని వైద్యులు సూచిస్తారు. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్‌ సమపాళ్లలో ఉండడం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసం వేగంగా వృద్ధి చెందుతుంది. కానీ.. ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా, పౌడర్‌ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో మొదటగా ఊరేవి ముర్రుపాలు. వీటిని బిడ్డకు తప్పకుండా తాగించాలి. వీటిలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసికందులో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. పుట్టిన బిడ్డకు ఆరు నెలలపాటు కచ్చితంగా ప్రతిరోజూ 12 సార్లు తల్లిపాలు తాగించాలి. పాలిచ్చే తల్లి అధికంగా నీరు తీసుకోవాలి. ఫలితంగా పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిమ్మజాతి పండ్లు, డ్రైప్రూట్స్‌, బీన్స్‌ అధికంగా తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *