తిమింగళం వాంతికి కోట్ల రూపాయలు..

ఎవరైనా వాంతి చేసుకుంటే చీ చీ అనుకుంటాం. కానీ ఇక్కడ వాంతికి కోట్ల రూపాయలు వస్తున్నాయట. అది మనిషి వాంతికి కాదులెండి. వికారం పుట్టించే వాంతికి కూడా ఎంతో విలువ ఉన్న‌ద‌ని మీకు తెలుసా..? కాక‌పోతే అది మ‌నిషి వాంతి కాదు. తిమింగ‌ళం వాంతి. అంబ‌ర్‌గ్రీస్‌గా పిలిచే ఈ తిమింగలం వాంతి దొరికితే ఎవ‌రైనా కోటీశ్వ‌రులు అయిపోయిన‌ట్టేన‌ట‌. తాజాగా యెమెన్ దేశంలో చేప‌ల‌ వేట‌కు వెళ్లిన జాల‌ర్ల‌కు రూ.10 కోట్ల విలువ చేసే అంబర్‌గ్రీస్‌ దొరికిందట‌. వివ‌రాల్లోకి వెళ్తే.. యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు కలిసి ఒకేసారి సముద్రంలో వేటకు వెళ్లార‌ట‌. వారికి స‌ముద్రం నీటిలో తేలుతున్న ఒక విచిత్ర వస్తువు కనిపించిందట‌. తీరా దాని దగ్గరకు వెళ్లి చూస్తే అది స్పెర్మ్ వేల్ వాంతి అని తెలిసిందట‌. అది చాలా విలువైన‌ది అని ప‌సిగ‌ట్టిన జాల‌ర్లు దాన్ని తీసుకొచ్చి మార్కెట్‌లో విక్ర‌యించ‌గా రూ.10 కోట్లు వ‌చ్చాయ‌ట‌. ఈ సొమ్మును తాము త‌లా కొంత పంచుకుని, మిగిలిన‌ది నిరుపేద జాల‌ర్ల‌కు ఆర్థిక సాయంగా అందించ‌నున్న‌ట్లు తెలిపారు.ఈ విష‌యాన్ని కాసేపు ప‌క్క‌నపెడితే.. అస‌లు తిమింగ‌ళం వాంతికి ఎందుకు ఇంత డిమాండ్ అనేది ఆస‌క్తి రేపుతున్న విష‌యం. అయితే, అంబర్‌గ్రీస్‌గా పిలిచే ఈ స్పెర్మ్ వేల్ వాంతిని సుగంధ పరిశ్రమలు అతి విలువైన ఖజానాగా ప‌రిగ‌ణిస్తాయ‌ట‌. ఇది దొరకడం చాలా అరుదు కాబట్టి ధ‌ర ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తార‌ట‌. అన్ని వాంతుల లాగే ఈ వాంతి కూడా ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు వాసన కొడుతుందట‌. కానీ, ఓసారి గట్టిపడింద‌టే సువాసన వెదజల్లుతుందట‌.అందుకే ఈ అంబ‌ర్‌గ్రీస్ పెర్ఫ్యూమ్ వాసను రెట్టింపుచేయడంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా చేస్తుందట‌. ఇది తిమింగళాల జీర్ణకోశంలో తయారవుతుంద‌ట‌. అవి వాంతి చేసుకున్న‌ప్పుడు నీళ్ల‌పై ప‌డి గ‌ట్టిప‌డుతుంద‌ట‌. అనంత‌రం అది నీటిలో తేలియాడుతూ తీరానికి కొట్టుకొస్తుంద‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *