దెయ్యాల గురించి తెలుసుకోవాలంటే..ఈ దీవికి వెళ్లొచ్చు..

మీకు దెయ్యాల గురించి తెలుసుకునేంత ద‌మ్ము వుందా..అయితే మీరు ఎంచ‌క్కా ఈ దీవికి వెళ్ళొచ్చ‌ట‌..కానీ కండిష‌న్స్ అప్లై. ఆ దీవి ఏంటి..ఆ వివ‌రాలు తెలుసుకుందాం.. నీటిపై తేలియాడే నగరం ‘వెనీస్’ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగరానికి 16 కిమీల దూరంలోనే ఓ అందమైన దీవి ఉంది. అది కూడా ప్రజలు నివసించేందుకు అనుకూలమైన ప్రాంతమే. కానీ, ఎవరూ ఆ దీవికి వెళ్లే సాహసం చేయడం లేదు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సైతం వెనుకడుగు వేస్తోంది. అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వానికే ధైర్యం లేదు. మరి సాధారణ ప్రజలు ఉండగలరా.. ఆ దీవిలో అడుగుపెట్టేందుకు ఎందుకంత భయపడుతున్నారు..ఆ అందమైన దీవి పేరు ‘పోవెగ్లియా’. కానీ, ఇటలీ ప్రజలు దాన్ని ఓ శవాల దిబ్బగా పేర్కొంటారు. అయితే అది స్మశానమైతే కాదు. ఒకప్పుడు ప్లేగు వ్యాధితో నరకయాతన అనుభవించిన రోగుల ఆర్తనాదాలతో మారుమోగిన భూలోక నరకం అది. 16వ శతాబ్దంలోనే సుమారు లక్ష మంది పైగా రోగులు అక్కడ మరణించారని చెబుతారు. కాలక్రమేనా ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడం మానేశారు. అయితే, వెనీస్ తదితర నగరాల్లో పర్యటించేందుకు వచ్చే చాలామంది పర్యాటకులు ఆ దీవిని చూసేందుకు అక్కడికి వెళ్లేవారు. కానీ, మళ్లీ తిరిగి రాలేదు. 16వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి ఇటలీని భయాందోళనకు గురిచేసింది. వ్యాధిగ్రస్తులను అక్కడే ఉంచితే అది మరింత మందికి సోకుతుందనే ఉద్దేశంతో శవాలను, రోగులను తీసుకెళ్లి ‘పోవెగ్లియా’లో వదిలేసేవారు. దీంతో, రోగులు ఆ శవాల మధ్యే జీవించేవారు. తిండి లేక, రోగానికి చికిత్స లభించక అక్కడే చనిపోయేవారు. వీరిలో చిన్నారులు కూడా ఉండేవారు. ఈ అరాచకాన్ని అప్పట్లో పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా లాభం లేకపోయింది. ఎన్నో పోరాటాల తర్వాత ప్రభుత్వం అక్కడ ఒక చర్చితోపాటు రోగులు ఉండేందుకు ఓ భవనం నిర్మించింది. వేల సంఖ్యలో చనిపోయిన రోగులను ఆ దీవిలోనే సామూహికంగా పూడ్చిపెట్టేశారు. స్థలం లేకపోవడంతో మిగతా శవాలను దహనం చేశారు. అభివృద్ధికి ఫలించని ప్రయత్నాలు: ఆ దీవిని మళ్లీ 1920లో ప్రజల కోసం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, ప్రజలు అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు. దీంతో అక్కడ ఓ మెంటల్ ఆసుపత్రి నిర్మించారు. అప్పటి నుంచి అక్కడి పరిస్థితులు మరింత భయానకంగా మారిపోయాయి. ఆ హాస్పిటల్‌లోని ఓ డాక్టర్ అక్కడి రోగులపై రకరకాల ప్రయోగాలు చేసేవాడు. చిత్రహింసలకు గురిచేసి చంపేసి శవాలను ఆనవాళ్లు లేకుండా చేసేవాడు. అతను కాకి ముక్కు తరహా మాస్క్ ధరించి తిరిగేవాడని అప్పటి ప్రజలు చెప్పేవారు. కొంతమంది రోగులు అక్కడ తమకు ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్పినా, వారి మానసిక స్థితి బాగోలేదని ఎవరూ నమ్మేవారు కాదు. కొద్ది రోజుల తర్వాత డాక్టర్‌కు కూడా అక్కడ ఆత్మలు కనిపించాయి. వాటిలో అతడి పరీక్షలకు బలైన రోగులు కూడా అతడికి కనిపించేవారని చెప్పాడని తెలిసింది. ఓ రోజు ఆ డాక్టర్ ఆ దీవిలోని టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మలే అతడిని చంపేశాయనే ప్రచారం జరిగింది. అడుగడుగునా ఆటంకాలే: ఎంతో అందంగా కనిపించే ఆ దీవిని పర్యటకానికి వినియోగించుకోవాలనే ఆలోచన వచ్చినా… కొన్ని సంఘటనలు పాలకులను వెనకడుగు వేసేలా చేశాయి. కొత్త నిర్మాణాలు చేపట్టడానికి తవ్వకాలు చేస్తున్న సందర్భంలో వేలల్లో శవాలు బయటకు రావడం కనిపించాయి. ఆత్మలు సంచరిస్తున్నాయనే వార్తలతో ఆ దీవిలోకి ప్రవేశం నిషేదించారు. అయితే, ఏకాంతం కోరుకునేవారు.. వెనీస్ నుంచి పడవల్లో ఆ దీవికి వెళ్లేవారని, వారి కోసం గాలించగా శవాలై కనిపించారని చెబుతుంటారు. దీవికి సమీపంలో నివసించేవారు తమకు వింతైన శబ్ధాలు వినిపిస్తాయని, టవర్‌లోని గంట ఎవరి ప్రమేయం లేకుండానే మోగుతుందని చెబుతుంటారు. ఇప్పుడు ఇది నిషేదిత ప్రాంతం. ఎవరినీ లోనికి అనుమతించరు. పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపితే. కొన్ని దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ దీవిలో ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉండబోదని ముందుగానే స్పష్టత ఇస్తారు. దెయ్యాల కోసం అన్వేషించేవారికి ఇది ఫేవరెట్ ప్లేస్. ప్రస్తుతం ఈ దీవిని లుగీ బ్రుగనరో అనే వ్యాపారవేత్త వేలం ద్వారా 7.04 లక్షల డాలర్లకు 99 ఏళ్లకు లీజు తీసుకున్నాడు. కానీ అక్క‌డికి వెళ్ళేందుకు మాత్రం ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *